ఎన్నికల కోడ్ ముగియడంతో పాలనపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా సమాలోచనలు జరుపుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా సెక్రటేరియట్ నుంచి ఈ విధానం అమలు చేసేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగులు టైమింగ్ ను అసలేం మాత్రం పాటించరని విమర్శలు ఉన్నాయి. ఆఫీసుకు లేట్ గా వచ్చి ఎర్లీగా ఇంటికి వెళ్తారని ఆరోపణలు వస్తుండటంతో వీటన్నింటికి చెక్ పెట్టాలని సర్కార్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. బయోమెట్రిక్ విధానం అమల్లోకి తీసుకురావడం వలన అఫీసర్లు టైమింగ్ పాటిస్తారని… అందరికీ అందుబాటులో కూడా ఉంటారని, పనుల్లో వేగం పెరుగడం వలన సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని అందుకే సాధ్యమైనంత తొందరగా ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది.
సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి , మంత్రులు , సీఎస్ , సెక్రటరీల నుంచి అటెండర్ వరకు అందరికీ పంచింగ్ చేయడం తప్పనిసరిగా చేయాలని సర్కార్ సమాలోచనలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదట సచివాలయంలో ఈ విధానం అమలు చేసి తర్వాత జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుందన్న చర్చ అధికారిక వర్గాల్లో జరుగుతోంది.ఈ విషయంలో విమర్శలు చెలరేగినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వెనక్కి తగ్గొద్దని రేవంత్ డిసైడ్ అయినట్లు టాక్.