ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం ప్రమాణస్వీకారం చేయనుండటంతో మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు పూర్తి చేయగా..మంత్రి పదవులు పొందే వారికి మంగళవారం సాయంత్రం స్వయంగా చంద్రబాబు ఫోన్ చేయనున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నుంచి ఫోన్ కాల్స్ ఎవరికీ వస్తాయా అనే ఉత్కంఠ కూటమి ఎమ్మెల్యేలలో కనిపిస్తోంది.
అంచనా వేసినట్లుగానే కూటమి సర్కార్ లో పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దాదాపు ఖాయంగా తెలుస్తోంది. అయితే, 2014లో ఇద్దరికీ డిప్యూటీ సీఎం పదవులను కట్టబెట్టిన చంద్రబాబు ఈసారి మాత్రం పవన్ ఒక్కరికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కీలక శాఖను కట్టబెడుతారని తెలుస్తున్నా… ఏ శాఖను కట్టబెడుతారు అనేది ఆసక్తి రేపుతోంది. అటు పవన్ తో కలిపి జనసేనకు చెందిన మరో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం.
కేంద్ర కేబినెట్ లో టీడీపీ నుంచి ఇద్దరికీ అవకాశం కల్పించింది బీజేపీ. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలోనూ బీజేపీకి రెండు పదవులను ఇవ్వాలని కోరగా అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. కామినేని శ్రీనివాస్ , సుజానా చౌదరితోపాటు ఆదినారాయణ రెడ్డిలు మంత్రి పదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వీరిలో ఎవరికీ అవకాశం దక్కుతుందనేది ఆ పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.