తమపై ప్రజల్లో వ్యతిరేకత లేదని ఇప్పటికీ వైసీపీ నేతలు భ్రమల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గొప్ప పాలన చేశారని చెప్పుకునేందుకు …తాము ప్రజల అసంతృప్తిని గుర్తించలేదని చెప్పేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జగన్ రెడ్డిని కలుస్తున్న వైసీపీ నేతలకు.. ఆయన చాంబర్ కు వెళ్లే ముందుగానే నేతలు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. జగన్ ముందు సమస్యలు ఏమీ చెప్పవద్దని… ప్రజల్లో అసంతృప్తిని గుర్తించలేకపోయామనే చెప్పాలని సూచించి పంపుతున్నారు. వారు లోపల అదే చెబుతున్నారు.
జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తారని భావిస్తున్న ఏ ఒక్కరినీ తాడేపల్లి ఆఫీసుకు రానివ్వడం లేదు. రావొద్దని చెబుతున్నారు. ఎవరూ కలవకపోతే జగన్ ను అందరూ వదిలేశారని అనుకుంటున్నారని కొంత మందిని మాత్రం సెలక్టివ్ గా పిలిపిస్తున్నారు. వారితో సమావేశం అవుతున్నారు. నిజానికి చాలా మంది పోటీ చేసిన అభ్యర్థులు జగన్ ను కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఓటమి తర్వాత వారు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కుటుంబాలకు సమయం కేటాయిస్తామని ఇప్పుడల్లా తమను డిస్ట్రబ్ చేయవద్దని సందేశాలు పంపుతున్నారు.
గెలిచిన వారిలో కొంత మందిపై పార్టీ మార్పు ప్రచారాలు జరుగుతూండటంతో వైసీపీలో నిర్వేదం కనిపిస్తోంది. అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, అరకు ఎంపీతో బీజేపీ చర్చలు జరిపిందని వారినీ చేర్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అనేక మంది నేతలు పార్టీ మార్పు ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీలో నేతలు జగన్ పై విశ్వాసంగా ఉన్నారని చెప్పుకునేందుకు కొంత మందిని రోజూ తాడేపల్లికి పిలుస్తున్నారు.