వైసీపీలో చాలామంది నేతలు కేశినేని నాని దారిలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. ఇంకా వైసీపీలో కొనసాగితే రాజకీయంగా మనుగడ ఉండే పరిస్థితులు లేవని ఓ అంచనాకు వస్తున్నారు. ఓటమి నుంచి తేరుకొని మరో ఐదేళ్లలో వైసీపీ పవర్ లోకి వచ్చే సీన్ లేదని సన్నిహితుల వద్ద ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎలాగోలా ధైర్యం చేసి టీడీపీ, జనసేన పార్టీలోకి వెళ్దామని ప్రయత్నాలు చేసినా..వారు డోర్ క్లోజ్ చేయడం ఖాయం.
వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు చేతలు కాకుండా నోటికి పని చెప్పిన నేతలు ఇప్పుడు అధికారం కోల్పోయాక వారెంత అధికార మత్తులో కూరుకుపోయారో ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. పరుషపదజాలంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను దూషించడంతో అక్కడ తమకు స్థానం ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పాలిటిక్స్ లో పవర్ శాశ్వితం కాదని అధికారం కోల్పోయాక గుర్తిస్తున్నారు.
ప్రస్తుతం వైసీపీ నేతలకు భవిష్యత్ బెంగ పట్టుకుంది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడంతో పాటు పలు అవినీతి, అక్రమాల్లో ఆరోపణలు ఉండటంతో ఏ కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందేనని టెన్షన్ పడుతున్నారు. వైసీపీలోనే ఇంకా కొనసాగితే తాము టార్గెట్ అవుతామని అందుకే కేశినేని నాని తరహాలో రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిదని కొంతమంది వైసీపీ నేతలు భావిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.