రాజకీయాల్లో కూటముల మధ్య పొరపొచ్చాలు రావడానికి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు. చిన్న చిన్న సమస్యలు చాలు. రాజకీయాల్లో పండిపోయిన చంద్రబాబుకు ఇది బాగాతెలుసు. అందుకే కూటమి విషయంలో ఆయన వ్యవహారశైలి ఏ మాత్రం లోపం లేని విధంగా ఉంది. తన పార్టీకి పూర్తి మెజార్టీకి మించి కావాల్సినన్ని సీట్లు వచ్చినా మిత్రపక్ష పార్టీలను ఏ మాత్రం తక్కువ చేయడం లేదు. జనసేన, బీజేపీలకు అత్యంత ప్రాధాన్య స్థాయిలో గౌరవం ఇస్తున్నారు.
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు వ్యవహారశైలి బీజేపీ, జనసేన నేతల్ని కూడా ఆశ్చర్య పరిచింది. సాధారణంగా అంత మెజారటీ ఉన్న పార్టీ నేత అలా వ్యవహరించాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కల్యాణ్ తన కన్నా తక్కువ కాదని.. ఆయన కూడా సీఎంతో సమానమని చెప్పడం ద్వారా అందరి మనసుల్ని గెలుచుకున్నారు. పవన్ కల్యాణ్ కూడా .. ఎక్కడాతన వైపు చిన్న సమస్య రాకుండా చూసుకున్నారు.
క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నా.. అవి పై స్థాయి రాజకీయ కూటమి బంధాల మధ్య సమస్యలు తేకుండా ఉండేలా అగ్రనేతలు వ్యవహరిస్తున్నారు. పదవుల విషయంలో కూడా చంద్రబాబు కూటమి నేతలతో చర్చించి.. నిర్ణయాలు తీసుకుంటున్నారు . ఏకపక్షంగా ముందుకెళ్లి .. కూటమిలో అపోహలు ఏర్పడకుండా చూసుకుంటున్నారు.