ప్రమాణ స్వీకారానికి రావాలని సంప్రదాయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి రాలేదు. జగన్ కు ఫోన్ లేదు. కానీ ఆయన ఆయన పీఏలు.. ఇతరులకు.. ఉంది. అందుకే పదకొండు సార్లు వివిధ ప్రయత్నాలు చేసినా జగన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. అంటే మాట్లాడటం ఇష్టం లేదన్న మాట.
జగన్మోహన్ రెడ్డి ఓటమి బాధలో ఉన్నారు. ఓటమి ఎవరికైనా బాధనిస్తుంది. కానీ దాన్ని బయటపడనీయకూడదు. గెలిచిన వాళ్ళను కనీస మాత్రంగా అభినందించడం సంస్కారం. జగన్మోహన్ రెడ్డిలో అలాంటి లక్షణాలేమీ కనిపించడం లేదు. సంప్రదాయంగా ప్రమాణ స్వీకారానికి తమ పార్టీ తరపున ప్రతినిధి బృందాన్ని పంపాల్సి ఉంది. కనీసం ఒక్కరినైనా పంపాలి. గతంలో టీడీపీ కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి ప్రతినిధిని పంపింది.
కానీ ఇప్పుడు అసలు చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతున్నా.. తెలియనట్లే ఉండాలని వైసీపీ అనుకుటోంది. నిజానికి వైసీపీ ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు. ఆ హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. కానీ ఇప్పటి వరకూ సీఎంగా ఉన్నారన్న కారణంగా చంద్రబాబు తానే స్వయంగా ఆహ్వానించాలనుకున్నారు. ప్రయోజనం లేకపోయింది. అయితే అధికారికంగా ఆహ్వానం మాత్రం.. తాడేపల్లి ప్యాలెస్ కు చేరిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.