సీనియర్లు, జూనియర్ల కలయికతో చంద్రబాబు కేబినెట్ ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ మంత్రివర్గంలో చాలామంది సీనియర్లను పక్కన పెట్టడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. గంటా శ్రీనివాస్, అయ్యన్న , పరిటాల సునీతతోపాటు పలువురు సీనియర్లను పక్కన పెపెట్టడంపై జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ముందుచూపుతోనే నిర్ణయాలు తీసుకుంటారని అందులో భాగంగానే చాలామంది సీనియర్లకు చోటు కల్పించలేదని తెలుస్తోంది.
ఏపీ అభివృద్ధి కోసం మరో ఇరవై ఏళ్ల దీర్ఘదృష్టితో పాలనా ఎజెండా ఖరారు చేసుకున్నారు చంద్రబాబు. అందుకే ఈ కేబినెట్ లో గతంలో మంత్రి పదవులు నిర్వర్తించిన కొద్దిమంది సీనియర్లకు మాత్రమే అవకాశం ఇచ్చారని..భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా జూనియర్లను సైతం ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతోనే కొత్త వారికి కేబినెట్ లో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
పైగా.. టీడీపీ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన యువనేతలకు గుర్తింపు ఇవ్వాలని జూనియర్లకు ఈ కేబినెట్ లో బెర్త్ ఖరారు చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ,ఇప్పటికే చంద్రబాబు తర్వాత లోకేష్ ను ఫ్యూచర్ లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తోంది టీడీపీ. ఈ నేపథ్యంలోనే లోకేష్ ప్రభుత్వంలోనూ పట్టు సాధించేందుకు ఈ కేబినెట్ కూర్పు జరిగి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.మొత్తానికి ఈ మంత్రివర్గ ఏర్పాటులో లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.