మెగా బ్రదర్స్ అంటే ప్రధాని నరేంద్ర మోడీకి ఎనలేని అభిమానం. అది ప్రతిసారీ కనిపిస్తూనే ఉంటుంది. వేదికపై పవన్ కనిపించిన ప్రతీసారీ ఆప్యాయంగా పలకరించిన వైనాలు చాలా చూశాం. చిరంజీవి విషయంలోనూ అంతే. చిరు ఇప్పుడు ఏ పార్టీలో లేకపోయినా, బీజేపీ నాయకులతో టచ్లో ఉంటారు. అందుకే మోడీ కూడా చిరుకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంటారు. వేదికపై చిరు ఉంటే, పకలరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొంటుంటారు మోడీ. చిరు, పవన్ ఒకే వేదికపై ఉంటే.. మోడీ రియాక్షన్ ఏమిటి అనేదానికి విజయవాడలో జరిగిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం ఓ సమాధానంలా నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ విశిష్ట అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అతిథిగా చిరంజీవికి ఆహ్వానం అందింది. ఇదే వేదికపై పవన్ కల్యాణ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తరవాత వేదికపై ఉన్న అతిథుల్ని ప్రధాని మోడీ అందరినీ పేరు పేరున పలకరిస్తూ వచ్చారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ చేయి పట్టుకొని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లడం, ముగ్గురూ చేతులు పైకెత్తి… అభిమానులకు అభివాదం చేయడం.. ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మోడీ, పవన్, చిరు ముగ్గురూ కాసేపు నవ్వులు చిందుస్తూ మాట్లాడుకొన్నారు. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని బీజేపీ పెద్దలు కోరుకొంటున్నారు. ఆయన ప్రజాకర్షణని ఓట్ల రూపంలో మార్చుకోవాలని బీజేపీ ఆరాట పడుతోంది. పవన్ ఎలాగూ ఇప్పుడు బీజేపీ పక్షమే. అందుకే చిరు కూడా వస్తే బీజేపీ ఓటు బ్యాంక్ మరింత దృఢంగా మారతుందని వాళ్ల నమ్మకం.