పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ మంత్రి. చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో పవన్‌కు చోటు దక్కింది. ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉంది. దాంతో పాటుగా కీలకమైన శాఖ అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ హోం శాఖ డిమాండ్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. హోం ఇచ్చినా, ఇవ్వకపోయినా… పవన్ చేతిలో ఓ కీలకమైన శాఖ ఉండడం ఖాయం. ఏ బాధ్యత అప్పగించినా పవన్ తన మార్క్ చూపించడానికి తహతహలాడే వ్యక్తే. ప్రజాసేవ తరవాతే ఏదైనా అనుకోవడం ఆయన నైజం. అధికారం చేతిలో లేనప్పుడే సినిమాల్ని వదిలేసి, జనం మధ్య తిరిగాడు పవన్. ఇప్పుడు అధికారంతో పాటుగా బాధ్యత కూడా భుజాలపై పడింది. ఇలాంటి తరుణంలో అటు సినిమాలూ, ఇటు రాజకీయాలూ ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నది ఆసక్తిగా మారింది.
పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత పవన్ భుజస్కంధాలపై ఉంది. ఇప్పుడే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి, కొంతకాలం శాఖాపరమైన పనులతో బిజీగా ఉండే అవకాశం ఉంది. పిఠాపురం నియోజక వర్గంపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టడం ఖాయం. ఏపీలోనే ఓ మోడల్ నియోజకవర్గంగా పిఠాపురంని తీర్చిదిద్దుతానని ఇది వరకే హామీ ఇచ్చాడు పవన్. కాబట్టి.. పిఠాపురంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఎం.ఎల్.ఏల కార్యకలాపాల్ని నిశితంగా పరిశీలించాల్సివుంటుంది. ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి, నిధులు సక్రమంగా వినియోగించేలా, ఇచ్చిన హామీలు నెరవేర్చాలా తన వంతు కృషి చేయాల్సిందే. ఇన్ని పనులు చూసుకొంటూ సినిమాల్ని పూర్తి చేయడం కత్తిమీద సామే. అందుకే… చేతిలో ఉన్న మూడు సినిమాల్నీ మెల్లమెల్లగా పూర్తి చేసేసి, ఇక కొత్త సినిమాల జోలికి వెళ్లకూడదని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. ముందుగా ‘ఓజీ’ ఫినిష్ చేయాలి. ఆ తరవాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పని పట్టాలి. ఇవి రెండూ అయ్యాక ‘వీరమల్లు’కి డేట్లు ఇవ్వాలి. ఈ యేడాదంతా ఈ మూడు సినిమాలకే కేటాయించి, ఆ తరవాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని పవన్ నిర్ణయించుకొన్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పవన్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు కూడా ఈ విషయంలో పవన్‌పై ఒత్తిడి తీసుకురాకూడదని అనుకొంటున్నారని సమాచారం.