ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో పాటు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఓ అన్నగా ఉద్వేగానికి లోనయ్యారు చిరంజీవి. అనంతరం తమ్ముడ్ని ఆలింగనం చేసుకొని ఆశీర్వదించారు. చిరు, పవన్, మోడీల ఆత్మీయ కలయిక, వాళ్ల అభివాదం ఈ కార్యక్రమానికే హైలెట్ గా నిలిచింది.
ప్రమాణ స్వీకారం పూర్తయిన తరవాత చిరు మీడియాతో మాట్లాడారు. కొత్త, పాత కలయికతో మంత్రివర్గ కూర్పు చాలా బాగుందని, గతంలో ఎప్పుడూ చూడనంత అభివృద్ది తెలుగు ప్రజలు చూస్తారని, ఏపీ భవిష్యత్తుపై భరోసా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు చిరంజీవి. పాలనా దక్షత, శక్తి సామర్థ్యం ఉన్న నాయికుల చేతికి అధికారం వచ్చిందన్న సంతోషం వ్యక్తం చేశారు. తమ్ముడు పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఆనందాన్ని కలిగించిందని, గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు చిరంజీవి. పవన్ చాలా కష్టపడ్డాడని, దానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు లభించిందని, పవన్ తన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తాడని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పూర్తి స్థాయిలో తను పని చేస్తాడన్న నమ్మకం ఉందన్నారు చిరు.