ఇచ్చిన మాటను చంద్రబాబు అధికారంలోకి రాగానే నెరవేర్చారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన వారికి రాబోయే ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందన్న చంద్రబాబు, అలాంటి నేపథ్యమున్న నేతలకు కూటమి సర్కార్ లో ప్రాధాన్యత ఇచ్చారు.
ప్రకాశం జిల్లాలో ఓటమి ఎరుగని నేతగానున్న గొట్టిపాటి రవికుమార్ , గుంటూర్ జిల్లాలో దూకుడుగా ఉండే అనగాని సత్య ప్రసాద్ లను చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకున్నారు. వీరిద్దరూ ఆర్థికంగా బలమైన నేతలు కావడంతో అప్పట్లో వారిని వైసీపీలో చేర్చుకొని జిల్లాలో టీడీపీని దెబ్బతీయాలని ప్లాన్ వేసింది. అయినా, వారిద్దరూ టీడీపీని వీడెందుకు సంసిద్దత వ్యక్తం చేయకపోవడంతో వైసీపీ కేసులను నమోదు చేసి వేధించింది. అసలే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అధిష్టానం సహకారంపై కూడా ఈ ఇద్దరు నేతలు ఎక్కువ డిపెండ్ అవ్వలేదు.
వారిద్దరిపై వైసీపీ వేధింపుల పర్వాన్ని ఖండించిన టీడీపీ హైకమాండ్ నైతికంగా మాత్రమే సపోర్ట్ చేసింది. పార్టీలోనే కొనసాగండి… అధికారంలోకి వస్తే సముచిత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది. అప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ గెలుపుపై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. అయినప్పటికీ చంద్రబాబు ఇచ్చిన నైతిక సపోర్ట్…భవిష్యత్ పై భరోసానే వారిని వైసీపీ వైపు కన్నెత్తి చూడకుండా చేసింది.
ఈ నేపథ్యంలోనే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గొట్టిపాటి రవి కుమార్, ఆనగాని సత్య ప్రసాద్ లు విజయం సాధించినా… సీనియర్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటంతో ఈ ఇద్దరికీ మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం లేదని అంతా భావించారు. వారు కూడా బహుశ ఆశలు వదిలేసుకొని ఉండొచ్చు , కానీ వారి పోరాటం, పార్టీ పట్ల వారికున్న చిత్తశుద్ది, గతంలో ఇచ్చిన మాటను పరిగణనలోకి తీసుకొని రవి కుమార్, సత్య ప్రసాద్ లను కేబినెట్ లోకి తీసుకున్నారు చంద్రబాబు.