ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఒక్క మంత్రి పదవిని మాత్రం పెండింగ్ ఉంచి.. మిగతా వాటిని చంద్రబాబు భర్తీ చేశారు. జనసేన పార్టీకి మొదటి నుంచి ఇస్తున్న ప్రాధాన్యత ప్రకారం మూడు కేబినెట్ పదవులు ఇచ్చారు. బీజేపీకి ఒక్కటి కేటాయించారు. అయితే ఎవరికీ అబ్లిగేషన్ ప్రకారం కాకుండా.. రాజకీయ సామర్థ్యాన్ని చూసే ఇచ్చారు. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తో పాటు బీజేపీ తరపున మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ప్రమాణం చేశారు. ఆయనను అమిత్ షా..తన మిత్రుడని ఆదరించాలని ప్రచారంలో కోరడం హైలెట్ అయింది.
ఇక టీడీపీ తరపున మంత్రుల ఎంపికకు చంద్రబాబు మొహమాటానికి పోలేదు. యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సారి డైనమిక్ పనితీరును చూపించాల్సి ఉంది. అందుకే సీనియర్లను చాలా మందిని పక్కన పెట్టేశారు. ఉత్తరాంద్రకు గంటాకు ఇచ్చి అయ్యన్నకు ఇవ్వకపోతే సమస్య వస్తుంది. అలా అయ్యన్నకు ఇచ్చి గంటాకు ఇవ్వకపోయినా తేడాలు వస్తాయి. అందుకే ఇద్దర్నీ పక్కన పెట్టేశారు. ఇలాంటి మొహమాటాలు పెట్టుకోలేదు. చాలా మంది సీనియర్లు మళ్లీ తాము పోటీ చేస్తామో లేదోనని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా చంద్రబాబు మాత్రం తాను అనుకున్న వారికే చాన్సిచ్చారు.
పయ్యావుల, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్.. ఇలాంటి వారి ఎంపిక టీడీపీ కార్యకర్తల్ని కూడా సంతృృప్తి పరిచింది. ఫైర్ చూపించాలనుకునే మంత్రులకే చంద్రబాబు చాన్సిచ్చారని ఇది పార్టీ పరంగా టీడీపీకి మేలు చేస్తుందని ఫీలవుతున్నారు. కొంత మంది సీనియర్లకు చాన్సిచ్చినా… ప్రాధాన్యం మాత్రం.. యువతకే దక్కింది. తప్పనిసరిగా అవకాశం కల్పించాలన్సిన ధూళిపాళ్ల వంటి ఒకరిద్దరు నేతలు అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఉన్నా.. చంద్రబాబు వారికి సర్ది చెప్పే అవకాశాలు ఉన్నాయి.