ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఇప్పుడు స్పీకర్ ఎవరు అన్న అంశంపైనే చర్చ జరుగుతోంది. కూటమి ఘన విజయం తర్వాత రఘురామ కృష్ణరాజుకు స్పీకర్ పదవి ఖాయమంటూ వార్తలు వచ్చాయి. కానీ , మంత్రివర్గ కూర్పు కారణంగా స్పీకర్ ఎంపిక విషయంలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే మరికొంతమంది నేతల పేర్లు తెరమీదకు వస్తున్నాయి.
గతానికి భిన్నంగా సీనియర్లతో పాటు జూనియర్లకు తన మంత్రివర్గంలో చంద్రబాబు అవకాశం కల్పించారు. చాలామంది సీనియర్ శాసన సభ్యులు ఈసారి మంత్రి పదవులను ఆశించారు. కానీ సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో చాలామంది సీనియర్లను బాబు పక్కనపెట్టాల్సి వచ్చింది. దీంతో మంత్రి పదవి ఆశించి భంగపడిన సీనియర్ శాసన సభ్యులు స్పీకర్ పదవిని ఆశిస్తున్నారు.
సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు ప్రముఖంగా కనిపిస్తోంది. నిజానికి, బుచ్చయ్య చౌదరికి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫాం అని అంతా అనుకున్నారు. కానీ , ఆయనకు అవకాశం దక్కకపోవడంతో సీనియార్టీ దృష్ట్యా స్పీకర్ గా ఆయన పేరును చంద్రబాబు పరిశీలించనున్నారు. ఉత్తరాంధ్రాకు చెందిన కిమిడి కళా వెంకటరావు పేరు కూడా వినిపిస్తోంది. ఆయనకు ఉన్న అనుభవంతో స్పీకర్ పదవికి వన్నె తెస్తారు అని అంటున్నారు. అలాగే, స్పీకర్ గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతను ఎంపిక చేయాలని భావిస్తే నక్కా ఆనంద్ బాబు పేరును చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.