ఈరోజు ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార ఘట్టం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలు చోటు చేసుకొన్నాయి. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చిరు మోము లక్ష వోల్ట బల్బుగా వెలిగింది. అనంతరం అన్నయ్య కాళ్లపై పడిన పవన్, ఆయన ఆశీర్వచనాలు అందుకొన్నారు. ‘అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలా ఉండాల్రా’ అంటూ మరోసారి మెగాఫ్యాన్స్ అంతా పులకించిపోయారు. గ్యాలరీలోని మెగా ఫ్యామిలీ మొత్తం ఈ దృశ్యాల్ని చూస్తూ ఆనంద పార్యవశ్యానికి లోనైంది.
మరోవైపు నందమూరి ఆడబడుచు భువనేశ్వరి వేదికపై కూర్చున్న సందర్భంలో బాలకృష్ణ ఆమె దగ్గరకు ఆప్యాయంగా వెళ్లి, ముద్దాడిన దృశ్యం… అభిమానుల కన్నులు చమర్చేలా చేసింది. అన్నగా బాలయ్య ఉద్వేగపడిన సందర్భాలు ఇవి. ఈ దృశ్యాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా షర్మిల దురదృష్టాన్ని సైతం ఏపీ ప్రజలు తలచుకొంటున్నారు. జగన్ గెలిచి, అధికారంలోకి రాగానే కుటుంబాన్ని దూరం పెట్టాడు. ముఖ్యంగా పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగి, తనకు ప్రచారం చేసిన చెల్లెలు షర్మిళను దూరం పెట్టాడు. అన్న వైఖరితో విసిగిపోయిన షర్మిళ కొత్తగా పార్టీ పెట్టి, జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దాంతో వైకాపా నాయకులు షర్మిళను సైతం టార్గెట్ చేశారు. ఆమెను నానా మాటలు అన్నారు. అప్పుడు అన్నగా ఖండియాల్సిన జగన్, ఆదుకోవాల్సిన జగన్… ఈ దుర్మార్గమంతా నవ్వుతూ చూస్తుండిపోయాడు. ఈ రెండు కుటుంబాలకూ ఎంత తేడా ఉందో ప్రజలకు ఈరోజు మరోసారి అర్థమైంది. దాంతో పాపం.. షర్మిళ అంటూ ఆమెపై మరోసారి సానుభూతి కురిపిస్తున్నారు నెటిజన్లు.