కన్నడ హీరో దర్శన్ ఇప్పుడు మర్డర్ కేసులో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. స్వయానా తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో దర్శన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న కన్నడ పోలీసులు త్వరిత గతిన దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు దర్యాప్తులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కన్నడ నటి పవిత్రతో దర్శన్ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నాడు. పవిత్ర మాయలో పడిన దర్శన్.. తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన వైనం దర్శన్ వీరాభిమాని అయిన రేణుకా స్వామి తట్టుకోలేకపోయాడు. సోషల్ మీడియాలో రేణుకా స్వామి పవిత్రకు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు చేశాడు. అంతేకాదు… తమ హీరోని వదలకపోతే, ఇబ్బందులు తప్పవని పవిత్రను హెచ్చరించాడు. ఈ విషయం… దర్శన్ వరకూ వెళ్లింది. దాంతో దర్శన్ తన అభిమాన సంఘ నాయకులతో రేణుకా స్వామిని కిడ్నాప్ చేయించి ఓ గోడౌన్లో బంధించాడు. రాత్రంతా చిత్ర హింసలకు గురి చేశాడు. ఆ దెబ్బలకు తాళ్లలేక రేణుకా చనిపోతే, ఆ శవాన్ని ఓ మురికి కాల్వలో పడేశారు.
మృతిడి శరీరంపై గాయాలు ఉండడంతో పోలీసులు ఈ కేసుని వేరే కోణంలోంచి దర్యాప్తు చేయడం మొదలెట్టారు. దాంతో కొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయి. మురికి కాల్వ చుట్టు పక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కొంతమంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. వాళ్లని పోలీసులు తమదైన స్టైల్ లో విచారిస్తే దర్శన్ వ్యవహారం బయటకు వచ్చింది. జూన్ 8న రేణుకా స్వామిని కిడ్నాప్ చేశారు. ఆ తరవాత గోడౌన్‌కి తరలించారు. ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుఝామున 3.30 వరకూ దర్శన్, పవిత్ర.. ఇద్దరూ తమ అనుచరులతో ఆ గోడౌన్లోనే ఉన్నారని దర్యాప్తులో పోలీసులు నిర్దారణకు వచ్చారు. దర్శన్ దాడి చేయడం వల్లే, రేణుకా చనిపోయాడన్నది సాక్ష్యుల కథనం. రేణుకా చనిపోయిన తరవాత తనని మురికి కాల్వ వరకూ తీసుకెళ్లి, అక్కడ పారేసినప్పుడు కూడా దర్శన్ అక్కడే ఉన్నట్టు స్పష్టమైంది. దాంతో దర్శన్‌తో పాటుగా పవిత్రని సైతం అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. దర్శన్ వివదాల్లో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ తనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దాంతో పోలీసులు ఇప్పుడు పాత కేసుల్ని కూడా బయటకు లాగుతున్నట్టు తెలుస్తోంది.