ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేయడంతో ఇక ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారు..? అనేది హాట్ టాపిక్ గా మారింది. హోంశాఖ లేదా సినీమాటోగ్రఫీ శాఖను కేటాయిస్తారా..? అని ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు కంప్లీట్ చేశారు. ప్రమాణస్వీకార అనంతరం తిరుపతి వెళ్ళిన చంద్రబాబు అమరావతికి రాగానే మంత్రులకు కేటాయించే శాఖలపై స్పష్టత రానుంది. చంద్రబాబు కేబినెట్ లో జనసేనకు మూడు మంత్రి పదవులను కేటాయించారు. ఇందులో పవన్ కు దక్కే శాఖపైనే అందరి దృష్టి నెలకొంది.
పవన్ కు డిప్యూటీ సీఎంతోపాటు కీలకమైన హోంశాఖను కేటాయిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ మాత్రం తనకు గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే పవన్ ను డిప్యూటీ సీఎం చేయడంతోపాటు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి , అటవీ, పర్యావరణ శాఖలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
జనసేనలో కీలకంగా వ్యవహరించే నాదెండ్ల మనోహర్ కు సివిల్ సప్లయ్, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినీమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు సమాచారం.