ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటుకు కారణమైన సూపర్ సిక్స్ హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ప్రజారంజక పాలన అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించనున్నారు.
20లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు డీఎస్సీ ఫైల్ పైనే మొదటి సంతకం చేయనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం తిరుపతి వెళ్ళిన చంద్రబాబు తిరిగి వచ్చాక సచివాలయంలో బాధ్యతలను స్వీకరించనున్నారు. అనంతరం డీఎస్సీ ఫైల్ పై సీఎంగా మొదటి సంతకం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు ఫించన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ ఫైళ్ళపై సంతకం చేయనున్నారు.
సామజిక ఫించన్లను మూడు నేల నుంచి నాలుగు వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆ ఫైలుపై చంద్రబాబు సంతకం చేయనున్నారు. దీని ద్వారా సుమారు 50లక్షల మందికి పైగా ఫించన్ దారులకు ప్రయోజనం కలుగుతోంది. అలాగే, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంపై అధికారులతో చంద్రబాబు చర్చిస్తారని తెలుస్తోంది. ఇలా సూపర్ సిక్స్ హామీలను ఒకదాని వెనక మరొకటి అమలు చేసుకుంటూ ఆరు నెలలో పూర్తి స్థాయిలో నెరవేర్చాలనే టార్గెట్ తో చంద్రబాబు ఎజెండా ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది.