పదవి పోయింది. పార్టీ తుడిచి పెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అయినా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భ్రమల్లో ఉండేందుకు.. నిజాలు అంగీకిరంచేందుకు ఆసక్తి చూపించడం లేదు. కలిసేందుకు పిలిపించుకుంటున్న కొంత మంది నేతలతో ఆయన చెబుతున్న మాటలు వింటున్న వారికి… ఓటమికి కారణాలు తెలుసుకునేందుకు ఆయన ఆసక్తి చూపించడం లేదని నిష్ఠూరపడుతున్నారు
కంది స్థాయి ఎమ్మెల్యేలు సీఎంవో గురించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, వాలంటీర్ల గురించి, సచివాలయవ్యవస్లల గురించి చెప్పి..అవి ఎంత మైనస్ అయ్యాయో మీడియా ముందు వెళ్లబోసుకుంటున్నారు. ఇవన్నీ చెప్పేందుకు జగన్ తమకు సమయం ఇవ్వలేదని వాపోతున్నారు. విచిత్రంగా ఇప్పుడు అలాంటి వాటిని తాడేపల్లి ఆఫీసుకు పిలిపిచ్చినా సరే వారిని మాట్లాడనివ్వడం లేదు. తాను చెప్పాలనుకున్నదే చెబుతున్నారు. లక్షన్నర శాంపిల్స్ తో ఎన్నికలకు ముందు.. తర్వాత సర్వేలు చేయించామని.. అంతా బాగుందని వచ్చిందని ఆయన అంటున్నారు. జగన్ మాటలు విని వచ్చిన వారు.. ఇక ఆయన మారరు మనమే మారాల్సి ఉందని మనసులో అనుకుని వెళ్లిపోతున్నారు.
ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామన్నదానిపై నిజాయితీగా విశ్లేషణ చేసుకుంటే తప్పులు దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటిదేమీ లేకుండా అంతా బాగుంది కానీ ఎందుకు ఓడిపోయామో తెలియదన్నట్లుగా నిప్పులపై దుప్పటి కప్పినట్లుగా వ్యవహరిస్తూ.. నిజాలను దాచేసుకుంటూ పోతే తప్పులను ఎప్పుడు దిద్దుకుంటారు ?. ఎప్పుడు పార్టీని దారిలో పెట్టుకుంటారు ?
పార్టీకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. నలభై శాతం ఓట్లు వచ్యాయంటే.. ముఖాముఖి పోరు జరిగింది కాబట్టి వచ్చాయి. రేపు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్సో.. మరో పార్టీని ఎదురు నిలబడితే.. తెలంగాణలో బీఆర్ఎస్కు వచ్చిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నిజాలు తెలుసుకుంటామని అన్నా ప్రయోజనం ఉండదు.