మీరు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారంటే.. మాకేం తెల్వద్.. మా పెద్ద సార్ చేయమంటే చేశామంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఆ మేరకు వీడియో స్టేట్ మెంట్ కూడా రికార్డు చేసేశారు. ఇప్పుడు విద్యుత్ ఒప్పందాల్లో ఈ అక్రమాలేంటి అని విచారణ కమిషన్ విద్యుత్ ఉన్నతాధికారులను అడిగితే.. వారు కూడా అదే డైలగ్ చెబుతున్నారు. సార్ చెప్పిండు.. చేసేశామని సింగిల్ లైన్ ఆన్సర్ ఇస్తున్నారు. విచారణ నోటీసులు పంపే దశకు వచ్చిన కాళేశ్వరంపై కమిషన్ విచారణలోనూ అధికారులు అదే చెబుతున్నారు. ఇప్పటికే డిజైన్లు, ఆర్థిక విషయాల్లో మొత్తం కేసీఆర్ నిర్ణయాలేనని స్టేట్మెంట్లు ఇచ్చారు.
ఇలా గత ప్రభుత్వంలో ఏం జరిగినా అందరూ కేసీఆర్ వైపే వేలు చూపిస్తున్నారు. కేసీఆర్ పదేళ్ల పాటు ఇష్టారాజ్య పరిపాలన చేశారు. నిబంధనలను పాటించారా లేదా అన్నది పట్టించుకోలేదు. తాను పెట్టిందే రూల్.. చేసిందే శాసనం అన్నట్లుగా పాలన చేశారు. అధికారులు కూడా ఆయనను కాదనే పరిస్థితి లేదు. అధికారం అసలు పోనే పోదనుకున్నారు. కానీ పోయింది. ఇప్పుడు అన్నీబయటకు వస్తున్నాయి . అయితే చెప్పినట్లుగా చేసిన తాము ఎందుకు ఇరుక్కోవాలని అనుకుంటున్నారేమో కానీ నిర్మోహమాటంగా అందరూ కేసీఆర్ పేరు చెబుతున్నారు.
అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. స్కామ్‌లు జరిగితే.. నేరుగా ప్రమేయం ఉంటే తప్ప.. సీఎం బాధ్యుడు కాదు. అధికారులే చట్టం, రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. అధికార వ్యవస్థ ఉంది.. రాజకీయ వ్యవస్థను నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చేయడానికే. ఇప్పుడు తప్పులు చేస్తే.. దానికి అధికారులే ప్రథమ బాధ్యులు. కేసీఆర్ పై తోసేసినా అధికారులు బయటపడే అవకాశం లేదు. వారు కూడా ఇరుక్కుంటారు.