ఏపీలో ఎవరు ఎన్ని సీట్లు గెలిచినా మొత్తం బీజేపీ ఖాతాలోకే అన్న సెటైర్ ఎన్నికలకు ముందు ఉంది. అప్పుడు టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిలో చేరలేదు. తర్వాత రాజకీయం మారిపోయింది. ఇప్పుడు ఫలితాలు వచ్చేశాయి. టీడీపీ, బీజేపీ అధికారికంగా మిత్రపక్షాలు. వైసీపీకి ఉన్న అనివార్యతల కారణంగా బీజేపీ కాళ్లు పట్టుకుని ఉండాల్సిందే. అలాగే ఉంటామని నేరుగానే చెబుతున్నారు. మరి బీజేపీ ఏం చేస్తుందన్నదే కీలకం.
మొదటి నుంచి బీజేపీకి అనధికారిక సామంత పార్టీగా వైసీపీ
2014-19 మధ్యలో టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీకి పూర్తి సపోర్ట్ ఉన్నప్పటికీ కలసి పోటీ చేసినందున ఏపీలో.. కేంద్రంలో బీజేపీ, టీడీపీ అధికారం పంచుకున్నాయి. అయితే ఏపీలో ఉన్న వైసీపీపై బీజేపీ ఆపేక్ష కొనసాగించింది. పరోక్షంగా ఆ పార్టీకి సపోర్ట్ చేసింది. ప్రత్యేకహోదా ఇవ్వలేమని బీజేపీ చెబితే… టీడీపీ దానికి తగ్గ ప్రయోజనాలు తీసుకునేందుకు టీడీపీ ప్రభుత్వం అంగీకరించింది. కానీ అదే పేరుతో జనాల్ని రెచ్చగొట్టేందుకు జగన్ను ప్రోత్సహించింది. ఇక జగన్ వ్యక్తిగత కేసుల విషయంలోనూ దర్యాప్తు సంస్థలు దూకుడు చూపించలేదు. మొత్తంగా వైసీపీతో కలిసి తమపై కుట్ర చేస్తుందన్న క్లారిటీ రావడంతోనే టీడీపీ గుడ్ బై చెప్పింది.
టీడీపీ కూటమిలో ఉన్నా వైసీపీపై బీజేపీకి సానుభూతే !
బీజేపీతో కలిసి ఉన్నా 2019లో ఓటమి తప్పదని బహుశా టీడీపీ పెద్దలకు అర్థమైపోయింది. తర్వాత రాజకీయాల కోసమైనా బయటకు రావాలని వచ్చారు. ఆ తర్వాత వైసీపీ, బీజేపీ బంధానికి అడ్డూఅదుపూ లేదు. నిజం చెప్పాలంటే అదంతా తెర వెనుక బంధమే. అంతా కనిపిస్తూ ఉంటుంది. కానీ తాము వేర్వేరని చెబుతూంటారు. ఎన్నికల వరకూ అదే జరిగింది. జగన్ చేసిన ప్రతి విధ్వంసానికి బీజేపీ సపోర్ట్ ఉంది. వారు ఒప్పుకోకపోయినా ఇది నిజం.
ఇప్పుడూ అదే చేస్తే కష్టం
ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి.. జగన్ బోర్లా పడ్డాడు. టీడీపీ ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సంకీర్ణంలో భాగంగా మారింది. మరి బీజేపీ ఇప్పటికైనా వైసీపీ విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తుందా లేకపోతే తమ కాళ్లు పట్టుకునే ఉన్నారు కదా.. అని ఎప్పట్లాగే కాపాడుతుందా అన్నది కీలకం. వివేకా హత్య కేసు దగ్గర నుంచి జగన్అక్రమాస్తుల కేసుల వరకూ.. కేంద్రం సపోర్టు లేకపోతే జగన్ బయటపడటం కష్టం. ఇప్పుడు కూడా జగన్ ను కాపాడితే బీజేపీ చేసేది మాత్రం… రాజకీయం కాదు.