ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య కార్యదర్శిగా ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమించారు. ఈయన పేరు గతంలో ఎప్పుడూ వినిపించలేదు. సీనియర్ అధికారి అయినప్పటికీ.. సమర్థుడైనా జగన్ ప్రభుత్వ ఆయనను లూప్ లైన్ లో పెట్టింది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచీ ఆయనకు పోస్టింగ్ లేదు. ఏడాది కాలంగా వెయిటింగ్లో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేర్వేరు చోట్లకు తిప్పుతూ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెట్టింది. ప్రభుత్వం మారగానే ఆయన నేరుగా సీఎం ముఖ్య కార్యదర్శి అయ్యారు.
జగన్ ప్రభుత్వంలో సివిల్ సర్వీస్ అధికారులకు నరకం కనిపించింది. సీనియర్, సిన్సియర్ అధికారులు చాలా మంది పోస్టింగ్ లేకుండా ఉండగా… రైల్వే ట్రాఫిక్, కోస్ట్ గార్డ్ వంటి వాటి నుంచి వచ్చిన అధికారులు వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని పాలన చేశారు. పోస్టింగుల కోసం కక్కుర్తి పడిన కొంతమంది .. అనని రూల్స్ ఉల్లంఘించి ఐదేళ్లు అదే శాఖల్లో పాతుకుపోయారు. దీంతో చాలా మంది సివిల్ సర్వీస్ అధికారులకు అసలు సర్వీస్ చేసే అవకాశమే రాలేదు.
ప్రజల కోసం ఐఏఎస్ల సేవలను ఎలా వినియోగించుకోవాలన్నదానిపై స్పష్టతతో ఉండే చంద్రబాబునాయుడు .. ఎవరు ఎలాంటి వారో కనిపెట్టగలరు. గతంలో తాను ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ జగన్ వద్ద చేరి తనపైనే తప్పుడు కేసులు పెట్టేందుకు కొంత మంది సహకరించారు. అలాంటి అధికారుల్ని ఈ సారి పక్కకు రాకుండా చూసుకుని సిన్సియర్ అధికారులతో పని చేయించుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.