టీ 20 వరల్డ్ కప్ లో భారత్ హ్యాట్రిక్ విజయాల్ని అందుకొంది. మూడు విజయాలతో సూపర్ 8లో బెర్త్ ఖాయం చేసుకొంది. అయితే… కోహ్లీ ఫామ్ మాత్రం భారత్ ను తీవ్రంగా కలవరపెడుతోంది. ఐపీఎల్ లో అద్భుతంగా ఆడి, సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ వరల్డ్ కప్‌లోనూ చెలరేగుతాడని అంతా అనుకొన్నారు. అయితే… న్యూయార్క్ పిచ్‌లపై కోహ్లీ దారుణంగా తడబడుతున్నాడు. మూడు మ్యాచ్‌లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ సమర్పించుకొన్నాడు. లక్ష్యం పెద్దది కాదు కాబట్టి, కెనడా బౌలింగ్ అంత పదునుగా ఉండదు కాబట్టి, భారత్ ఈ మ్యాచ్‌లో గట్టెక్కింది. లేదంటే పరిస్థితి ఇంకెలా ఉండేదో?
సూపర్ 8లో పటిష్టమైన జట్లతో తలపడాల్సివస్తుంది. అప్పుడు కూడా కోహ్లీ ఇలానే ఆడితే, భారత్ కప్ గెలవడం కష్టం. కోహ్లీని ఓపెనర్‌గా పంపించడం పెద్ద పొరపాటని, తనకు వన్ డౌన్ బాగా సూట్ అవుతుందని మాజీలు చెబుతున్నారు. అయితే కోహ్లీని మినహాయిస్తే, రోహిత్ తో కలిసి బరిలో దిగడానికి మరో రెగ్యులర్ ఓపెనర్ కనిపించడం లేదు. ఐపీఎల్ లో కోహ్లీకి ఓపెనర్‌గా వెళ్లిన అనుభవం ఉంది. అందుకే మేనేజ్మెంట్ రిస్క్ చేస్తోంది. అయితే ఐపీఎల్ పిచ్‌లు వేరు, న్యూయర్క్‌లో ఎదురవుతున్న అనుభవాలు వేరు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఓపెనింగ్ లో మార్పులు చేస్తే మంచిదని మాజీలు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ ఒక్కడే కాదు, రోహిత్ శర్మ ఫామ్ కూడా ఆందోళనకరంగానే ఉంది. తొలి మ్యాచ్‌లో మినహాయిస్తే, పాక్‌తో మ్యాచ్‌లో తడబడ్డాడు. కెనడాతో కూడా తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. వీళ్లిద్దరూ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే వరల్డ్ కప్ పై ఆశలు వదులుకోవాల్సిందే.