వైసీపీ – టీడీపీ పాలనకు మధ్య తేడా ఏంటో మీరే చూస్తారంటూ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే మార్పుకు శ్రీకారం చుట్టారు. ప్రాధాన్యత అంశాలను మొదట గుర్తించి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప మనస్సును చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు రీఓపెన్ కావడంతో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉంచిన స్కూల్ బ్యాగ్ కిట్ లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్ బ్యాగ్ కిట్ లపై జగన్ బొమ్మ ఉన్నప్పటికీ వాటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సకాలంలో స్కూల్ బ్యాగ్ కిట్ లను చేరవేయాలని, ఈ విషయంలో ఆలస్యం చేయవద్దని సూచించారు.
కక్ష సాధింపు చర్యలకు తమ ప్రభుత్వం దూరంగా ఉంటుందని స్పష్టం చేసిన చంద్రబాబు దానిని రుజువు చేస్తున్నారు. ప్రభుత్వ డబ్బులను దుబారా చేయవద్దని అధికారులకు సూచించారు. గతంలో చంద్రబాబుపై అక్కసుతో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ల పేరు మార్చారు. కానీ, తాజాగా ప్రభుత్వం మారినా చంద్రబాబు మాత్రం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ బ్యాగ్ లను యధాతధంగా పంపిణీ చేయాలంటూ గొప్ప మనస్సు చాటుకున్నారు. ఇది ఏపీలో మార్పుకు సంకేతమని అభివర్ణిస్తున్నారు టీడీపీ నేతలు.
స్కూల్ బ్యాగ్ ల విషయంలో రాజకీయాలు చేయడం సరైంది కాదని సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.