తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి చోటు చేసుకుందని అనూహ్యంగా రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గొర్రెల స్కామ్ లో 700కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఎంట్రీ ఇచ్చిన ఈడీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం ప్రేక్షకపాత్ర వహించడం చర్చకు దారితీస్తోంది.
గొర్రెల పంపిణీ పథకంలో అవినీతిని నిగ్గు తేల్చేందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం ( పీఏంఎల్ఏ ) కింద ఈడీ విచారణ చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తమకు ఇవ్వాలని ఇప్పటికే పశు సంవర్ధక శాఖను కోరింది. ఇక్కడే ఈడీ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. దేశంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ ద్వారా బడా, బడా పారిశ్రామిక వేత్తలను బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు సేకరించినట్లు నిందితులు వాంగ్మూలంలో స్పష్టం చేశారు. భారీగా నగదు చేతులు మారినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నా ఈడీ ఎందుకు ఈ కేసులోకి ఎంట్రీ ఇవ్వడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
గొర్రెల స్కామ్ ను ఈడీకి అప్పగించాలని ఎవరూ కోరలేదు అయినా, ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని డిమాండ్లు వస్తున్నా ఈడీ రంగంలోకి దిగకపోవడంతో ఈ కేసు పొలిటికల్ టార్గెటెడ్ గా సాగుతుందనే వాదనలకు తాజా పరిణామం బలం చేకూర్చేలా ఉంది. ఇప్పటికే ఈడీ బీజేపీ పెద్దల డైరక్షన్ లో కొనసాగుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసును పక్కనపెట్టి గొర్రెల స్కామ్ లో మాత్రం ఈడీ రంగంలోకి దిగడం రాజకీయ ప్రేరేపితమేనని విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.