ఎప్పుడో ఐదేళ్ల కిందట వాడుకొని వదిలేసిన నినాదమే వైసీపీకి జీవం పోస్తుందని జగన్ రెడ్డి నమ్ముతున్నట్టున్నారు. అందుకే ఆ నినాదమే తాజాగా తెరమీదకు తీసుకొచ్చారు. వైసీపీని 2019లో అధికారపీఠంపై కూర్చోబెట్టిన ప్రత్యేక హోదా నినాదమే మళ్లీ వైసీపీకి ప్రాణం పోస్తుందని విశ్వసిస్తున్నట్టు కనిపిస్తున్నారు జగన్.
తాజాగా ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓటమిపై నిరుత్సాహపడవద్దని చెప్తూనే ప్రత్యేక హోదాపై మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వైసీపీ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని ప్రజలను నమ్మించిన ప్రత్యేక హోదాను సాధించకపోగా, ఆ నినాదాన్ని జపించడం వైసీపీ ఎప్పుడో మానేసింది. అయినా, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని జగన్ రెడ్డి తెరమీదకు తీసుకురావడంతో వారు అవాక్కయ్యారు.
వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు స్పెషల్ స్టేటస్ పై ఏనాడూ నోరు మెదిపింది లేదు. 22మంది ఎంపీలు ఉన్నా పార్లమెంట్ లో ఆందోళన చేపట్టింది లేదు. కానీ ,అధికారం కోల్పోగానే ప్రత్యేక హోదాపై మళ్ళీ తమ రాజకీయాలను స్టార్ట్ చేశారు జగన్. ఎన్డీయేలో టీడీపీ కీలకంగా ఉందని, ఇప్పటికైనా ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలని ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
జగన్ ఈ అంశంపై మాట్లాడితే ఐదేళ్ళు వైసీపీ ఏం చేసిందన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా జగన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీని ఇరకాటంలోకి నెట్టాలనుకున్నా , వైసీపీనే వేలెత్తి చూపేలా ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి జగన్ రెడ్డి మున్ముందు ఇదే అంశం ఎజెండాగా రాజకీయం చేయాలనుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది. స్పెషల్ స్టేటస్ విషయంలో వైసీపీపై జనాలు ఎప్పుడో నమ్మకం కోల్పోయారు. ఐదేళ్ల తర్వాత ఇదే అంశంపై జగన్ రెడ్డి రాజకీయం స్టార్ట్ చేసినా ఆయనకు జనాల నుంచి మద్దతు లభించడం కష్టం. జగన్ ఈ అంశంపై మాట్లాడటం అవివేకమే తప్ప మరొకటి కాదని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు.