కాలం కరిగిపోతుంది. అది నిజమే. కరిగిపోయిన కాలం క్షణాల్లో అయిపోయిందనుకుంటారు. వైసీపీ అధినేత జగన్ రెడ్డికి కూడా అలాగే అనిపిస్తోంది. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే అయిపోయాయని మరోసారి కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోతాయని పార్టీ నేతలకు చెబుతున్నారు. ఆయన లాజిక్ విని పార్టీ నేతలకు నవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. కళ్లు మూసుకుని తెరిచేలోపు జరిగే వాటిని ఎలా తట్టుకోవాలో అని వారు కిందా మీదా పడుతున్నారు.
ఒక్క చాన్స్ అంటే.. కులద్వేషం పేరుతో రాజకీయం చేస్తే 151 సీట్లు ఇస్తే ఏం చేశారు ?. చేయాల్సినదంతా చేసుకుని కళ్లు మూసుకున్నారు. మరో పది ఎన్నికలకు అయినా సరిపడనంత సంపాదించుకున్నారు. కానీ ప్రజలకు ఏమీ చేయలేదని తెలిసి… ఇంటికి పంపారు. అలా ఇలా కాదు.. ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా పంపేశారు. ఇంత ఘోరమైన ఓటమి తర్వాత కూడా జగన్ రెడ్డి కళ్లు మూసుకుంటే చాలనుకుంటున్నారు. ఇలాంటి మైండ్ సెట్ తో పార్టీని కాపాడుకోవడం.. అదీ కూడా ఆయన పాలనా తీరు చూసిన జనం మరోసారి చాన్సివ్వడానికి.. ఏ మాత్రం ఇష్టపడని వ్యవహారం చూస్తే ఎవరికైనా ఈయన రాజకీయ నేతేనా అనిపిస్తుంది.
ప్రతిపక్షం అంటే… తప్పుడుప్రచారాలు చేసుకుని ప్రజలు ఓట్లేస్తారని ఆశపడటం కాదు. అంతకు మించి చేయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలి. కంటి మీద కనుకులేకుండా పోరాటం చేయాలి. కానీ ఏం చేసినా తమ పాలనలోని నిర్వాకాలు ఎప్పటికప్పుడు అడుగడుగునా గుర్తుకు వస్తాయి. ప్రతీ అడుగులోనూ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అన్నీ చెప్పి.. ప్రజలను కన్విన్స్ చేస్తేనే అధికారం లభిస్తుంది. ఎందుకంటే.. ఐదేళ్ల విధ్వంస పాలన అంత తేలికగా ప్రజలు మర్చిపోలేరు.
అందుకే అధికారంలో ఉన్న ఐదేళ్లు కళ్లు మూసుకున్నట్లుగా అయిపోతాయి.. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిక్షణం ఐదేళ్లుగా సాగుతాయి. ఆ అనుభవం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి.