గొర్రెల స్కామ్లో కేసీఆర్పై ఈడీ కేసు పెట్టిందంటూ ఎంపీ రఘునందన్ రావు ప్రకటించారు. అంతే కాదు నోటీసులు కూడా ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఎంపీ కాబట్టి ఆయనకు విశ్వసనీయ సమాచారం వచ్చిందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఈడీ ఇంకా గొర్రెల స్కాంలో వివరాల సేకరణ దగ్గరే ఉందని… నోటీసుల వరకూ రాలేదని చెబుతున్నారు. అయినా ఈడీ నేరుగా కేసీఆర్ వద్దకు వచ్చే అవకాశం లేదని.. స్పష్టంగా కేసీఆర్కు నగదు చేరినట్లుగా ఆధారాలు ఉంటేనే నోటీసులు జారీ చేస్తారని గుర్తు చేస్తున్నారు.
గొర్రెల స్కీమ్ కేసీఆర్ మొదటి విడత పాలన లో కాస్త బాగానే నడిచింది. రెండో విడత లో మొత్తం స్కామే. అందరూ డబ్బులు పంచేసుకున్నారు. ఒక్క యూనిట్ నే పదే పదే చూపించి డబ్బులు దోచుకున్నారు. ఇందులో నేరుగా కేసీఆర్ ప్రమేయం ఉండే చాన్స్ లేదు . సంబంధిత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కనుసన్నల్లోనే అంతా నడిచింది. అందుకే ఆయన పీఏను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వెళ్తే.. గిళ్తే ఆ కేసు తలసాని దగ్గరకు వెళ్తుంది కానీ నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లే అవకాశం లేదు.
అయితే కేసీఆర్ తో మైండ్ గేమ్ ఆడేందుకు..కేసులలో ఇరుక్కుపోతున్నారని బెదిరించేందుకు ఈ తరహా ప్రకటనలు బీజేపీ నేతలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈడీ నోటీసులు వచ్చి ఉంటే ఈ పాటికి అంతా రచ్చ అయిఉండేది. ఎప్పుడు రావాలి. . ఎక్కడికి రావాలో కూడా లీక్ చేసి ఉండేవారు. కేసీఆర్కు పవర్ కమిషన్ మాత్రమే నోటీసులు ఇచ్చింది.. అదీ కూడా ఎదుట హజరు కావాలని కాదు.. వివరాలు ఇవ్వాలనే.