కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించారు. కష్టకాలంలో గెలిపించిన వయనాడ్ నుండి మరోసారి గెలవగా, సోనియాగాంధీ సిట్టింగ్ స్థానం రాయబరేలీ నుండి పోటీ చేసి గెలుపొందారు.
ఈనెల 24 నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎంపీల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఈలోపే రాహుల్ ఏదో ఒక స్థానానికి రిజైన్ చేయాల్సి ఉంది. దీంతో రాహుల్ ఆపదలో ఆదుకున్న వయనాడ్ వైపు ఉంటారా… వారసత్వంగా వస్తున్న రాయబరేలీ నుండి కొనసాగుతారా అన్న చర్చ జోరుగా సాగుతుంది.
అయితే, వయనాడ్ నే వదులుకునేందుకు రాహుల్ సిద్ధం అయ్యారని.. కానీ వెరొకరికి ఛాన్స్ ఇవ్వకుండా తన సోదరి ప్రియాంకను అక్కడి నుండి ఉప ఎన్నికలో నిలబెట్టే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. రాహుల్ వయనాడ్ ను వదులుకుంటారని కేరళ కాంగ్రెస్ ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. కానీ ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న సమాచారం వారికి లేదు. కానీ, ఆ సీటును వదులుకోవటం ఇష్టం లేని రాహుల్ గాంధీ… ప్రియాంక గాంధీని పోటీ చేయాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
నిజానికి, మరో రెండు సంవత్సరాల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికల సమరం ఉంటుంది. యూపీ ఎన్నికలపైనే ఫోకస్ గా ప్రియాంక గాంధీ గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఈ ఎన్నికల్లో కొంత ఫలితం కూడా కనపడటంతో ప్రియాంక గాంధీయే యూపీలో ఉంటారని, ఎంతో ఆదరించిన సౌత్ ఇండియా నుండి రాహుల్ కంటిన్యూ అవుతారన్న ప్రచారం ఉన్నా… చివరకు రాహుల్ అటు వైపే మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం మొదలైంది.