yevam movie review
రేటింగ్: 1.5/5
‘అపరిచితుడు’ స్ల్పిట్ పర్సనాలిటీని 360 డిగ్రీల్లోనూ వాడేసిన సినిమా. ఆ ప్రభావం చాలా కథలపై పడింది. ఇదే ఫార్ములా వాడుకొని కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటో రెండో ఆడాయి. ఇలాంటి కథలు, పాత్రలు చూసి ప్రేక్షకులకూ బోర్ కొట్టేసింది. అయినా కథకులు ఈ ఫార్ములా వదల్లేదు. అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ‘యేవమ్’ కూడా అలాంటి కథే. చాందినీ చౌదరి పోలీస్ యూనిఫామ్ తొలిసారి పోలీస్ యూనిఫామ్‌లో కనిపించడం, ఓ సంస్కృత పదాన్ని టైటిల్‌గా వాడుకోవడం ‘యేవమ్’పై ఆసక్తిని కలిగించాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? చాందినీ చౌదరి రీ – ఇంట్రడ్యూస్ సినిమా ఎలాంటి ఫలితాన్ని తీసుకొచ్చింది.
వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే కథ ఇది. ఈ స్టేషన్లో ట్రైనీ ఎస్.ఐగా సౌమ్య (చాందినీ చౌదరి) అడుగుపెడుతుంది. ఆ స్టేషన్ ఇన్ఛార్జ్ అభిరాం (భరత్‌రాజ్). ఎప్పుడూ డ్యూటీ… డ్యూటీ అంటూ పనిలోనే నిమగ్నమై ఉంటాడు. మరోవైపు ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు… ఇలా సినిమా స్టార్ల పేర్లు వాడుకొంటూ, అమ్మాయిల బలహీనతలతో ఆడుకొంటూ, కృత్రిమమైన ఆనందాన్ని తీర్చుకొనే సైకో యుగంధర్ (వశిష్ట సింహా). తనని పట్టుకోవడం అభిరాంకు సవాల్‌గా మారుతుంది. సైకో కేసుని డీల్ చేసి, తన సామర్థ్యం ఏమిటో నిరూపించుకోవాలనుకొంటుంది. అందుకే ఓరోజు ఒంటరిగా యుగంధర్ని పట్టుకోవడానికి వెళ్తుంది. అప్పుడేమైంది? యుగంధర్ దొరికాడా లేదా? అసలు తను సైకోగా మారడానికి గల కారణం ఏమిటి? ఇదంతా తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఇదో క్రైమ్ థ్రిల్లర్. అయితే క్రైమ్‌ని చూపించిన విధానం, థ్రిల్ రెండూ అంతంతమాత్రంగా ఉంటాయి. ఫస్ట్ సీన్లోనే యుగంధర్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడే తన నైజం మొత్తం బయటపడుతుంది. ఆ తరవాత అమ్మాయిల్ని హీరోల పేరుతో ట్రాప్ చేసే ఎపిసోడ్‌లోకి వెళ్లిపోతుంది కథ. తొలి అమ్మాయిని ట్రాప్ చేసే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. కానీ.. మళ్లీ మళ్లీ అలాంటి ట్రాపులే చూడడంతో సదరు అమ్మాయిలపై సానుభూతి కలగకపోగా, విసుగు మొదలవుతుంది. పోలీస్ స్టేషన్లో అభి – సౌమ్య మధ్య నడిచే ట్రాక్ కూడా బోరింగ్ ఎలిమెంటే. అసలు అభిలో ఏం చూసి సౌమ్య అంతగా ఇష్టపడుతోందన్నది రిజిస్టర్ చేయలేదు. సైకోని పట్టుకోవడానికి సౌమ్య ఇచ్చే ఐడియాలేం కొత్తగా అనిపించవు. సాధారణంగా ఏ క్రైమ్ జరిగినా, ‘సైకోని ఇలా పట్టుకోవొచ్చు కదా, జనాల్లో ఇలా ఎవైర్నెస్ కలిగించొచ్చు కదా’ అని మనకు అనిపించే విషయాలే… తెరపై కొత్త ఐడియాల రూపంలో ప్రజెంట్ చేస్తుంటే, దర్శకుడు ఈ కథపై సరిగా కసరత్తు చేయలేదన్న ఫీలింగ్ వస్తుంది. ఇంట్రవెల్ కి ఓ భారీ ట్విస్టు రావాలి, లేదంటే ఈ కథ నిలబడదన్న అభిప్రాయానికి వచ్చేస్తాడు ప్రేక్షకుడు. దర్శకుడు కూడా ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కాకపోతే.. ఆ ట్విస్టు చూసి ఆడియన్ కుదేలైపోతాడు. ఓరకంగా ప్రేక్షకుడ్ని మిస్ గైడ్ చేసిన ట్విస్ట్ ఇది. అదేదో ఇక్కడ చెప్పడం భావ్యం కాదు. తెరపై చూసినప్పుడు కచ్చితంగా దర్శకుడిపై కోపం, అసహనం కలుగుతాయి.
ఇంట్రవెల్ బ్యాంగ్ చూశాక, దర్శకుడి తెలివితేటలపై ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు ప్రేక్షకుడు. ఆ తరవాత కథేమిటన్నది అర్థమైపోతుంది. సైకోని పట్టుకోవడమే మిగిలిన సంగతి. అయితే తొలి భాగంతో పోలిస్తే ద్వితీయార్థం కాస్త మెరుగ్గా తీయగలిగాడు దర్శకుడు. సైకో తన పక్కన తిరుగుతున్నా, హీరోయిన్ గమనించలేకపోవడం, హీరోయిన్ ఎక్కడ సైకో ఉచ్చులో పడిపోతుందో అనే భయాన్ని కలగజేయడంలో దర్శకుడు కాస్త సక్సెస్ అయ్యాడు. ఆడిటోరియంకు తెలిసిన విషయం స్క్రీన్కు తెలియకపోవడం అనేది రిస్కీ ఫ్యాక్టర్. దాన్ని వీలైనంత త్వరగా రివీల్ చేయాలి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కాలయాపన జరిగింది. క్లైమాక్స్ లో ట్విస్ట్ రివీల్ చేసిన పద్ధతి సైతం హడావుడిగా ఉంటుంది. సైకోని ఎలా పట్టుకొంది? ఎలా గుర్తించింది? అనే విషయాల్లో కథానాయిక తెలివితేటలేం ఈ కథలో కనిపించవు. అది మరో ప్రధాన లోపం.
చాందినీచౌదరి మంచి నటి. తెలుగమ్మాయి కాబట్టి ఇంకొన్ని గ్రేస్ మార్కులు ఇవ్వాలి. అయితే తనకు పోలీస్ క్యారెక్టర్ ఎందుకో సూట్ అవ్వలేదనిపిస్తోంది. ఆ పాత్రకు ఉండాల్సిన ఎగ్రసివ్నెస్ చాలా చోట్ల కనిపించదు. యూనిఫామ్ వేసుకొన్నా సగటు అమ్మాయిలానే ప్రవర్తిస్తుంది, అలానే మాట్లాడుతుంది. చివర్లో మాత్రం ఓ యాక్షన్ సీన్ కంపోజ్ చేశారు. వశిష్ట విలనిజం బాగుంది. తన బేస్ వాయిస్‌తోనే భయపెట్టాడు. భరత్ రాజ్‌ది కీలకమైన పాత్ర. ఆ పాత్రలో తెలిసిన నటుడైతే ఇంకాస్త ఇంపాక్ట్ ఉండేది. గోపరాజు రమణ కానిస్టేబుల్ పాత్రలో ఆకట్టుకొన్నారు.
ఓ సైకో థ్రిల్లర్‌ని, స్ల్పిట్ పర్సనాలిటీ కథగా మార్చేశాడు దర్శకుడు. థ్రిల్లర్ కథల్లో ఉండాల్సిన వేగం ఈ సినిమాలో కనిపించదు. ట్విస్టులు ఉన్నా, ఆకట్టుకోవు. రైటింగ్ పరంగా ఇంకా మెరుగ్గా ఉండాల్సిన సినిమా ఇది. చిన్న సినిమా కాబట్టి, ఇంత కంటే క్వాలిటీ ఆశించలేం. స్క్రీన్ ప్లే పరంగా ప్రేక్షకుల్ని మిస్ గైడ్ చేసిన సినిమాల్లో ఇదొకటి. ఇలాంటి జిమ్మిక్కులకు ప్రేక్షకులు పడిపోతారా, సినిమాలకు విజయాన్ని కట్టబెడతారా? అనేది అనుమానమే.
రేటింగ్: 1.5/5