ఏపీలో కొత్త సర్కారు కొలువుదీరగానే… పాలనలో దూకుడు పెంచింది. గత ఐదేళ్లుగా విచ్చలవిడిగా జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఫోకస్ చేస్తూనే, సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు.
అయితే, గత ప్రభుత్వ హాయంలో తీసుకున్న నిర్ణయాల్లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఎన్నికల ముందు సర్కార్ సొంత ప్రచారం కోసం మొదలుపెట్టిన ఆడుదాం ఆంధ్రా వంటి పథకాల్లో భారీగా గోల్ మాల్ జరిగిందన్న ఆరోపణలపై తీగ లాగుతుంటే డొంక కదులుతోంది.
ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్ పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించారని… కిట్స్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయని సీఐడీకి ఫిర్యాదు అందింది. అంతేకాదు గత ఐదు సంవత్సరాల కాలంలో స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్స్ తీసుకొని ఉద్యోగాలు పొందిన వారిపై ఎంక్వైరీ చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీఐడీ దీనిపై కేసు నమోదు చేస్తే ఆనాటి క్రీడాశాఖ మంత్రిగా రోజా, శాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలకు ఇబ్బందులు మొదలైనట్లే. క్రీడాశాఖలో ఈ ఇద్దరు నేతల చెప్పినట్లే సాగిందని… వెంటనే ఆ శాఖలో ఉన్న ఫైల్స్ సీజ్ చేసి, ఆనాటి అధికారులను విచారిస్తే వ్యవహరం అంతా బయట పడుతుందని ఫిర్యాదుదారులంటున్నారు.
ఇన్నాళ్లుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, అడ్డగోలుగా దోపిడీ చేసిన వారందరికీ శిక్ష తప్పదంటూ కొత్త సర్కార్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.