Music Shop Murthy movie review
తెలుగు360 రేటింగ్: 2.5/5
కొన్ని కథలు చదవడానికి బాగుంటాయి. కావల్సినంత స్ఫూర్తిని అందిస్తాయి. అయితే అలాంటి ప్రతీ కథా సినిమాకు సరిపోదు. సినిమా కథకుండే కొలతలు వేరు. ఎలాంటి కథైనా వినోదాత్మకంగా చెప్పాలి. ప్రేక్షకులు ఇచ్చే రెండు గంటలకూ తగిన న్యాయం జరగాలి. ఇప్పుడు మనం చెప్పుకొనే ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథలోనూ స్ఫూర్తి రగిలించే అంశం ఉంది. ప్రతిభకు వయసుతో సంబంధం లేదన్న మంచి పాయింట్ ఉంది. అయితే ఈ సందేశం సినిమా సూత్రాలకు అనుగుణంగా సాగిందా? ఈ లేటు వయసులో అజయ్ ఘోష్ హీరోయిజం ఎలా వుంది?
మూర్తి (అజయ్ ఘోష్)ది మధ్యతరగతి జీవితం. భార్య (ఆమని), ఇద్దరు పిల్లలు. ఊర్లో ఓ మ్యూజిక్ షాప్ ఉంటుంది. ఆదాయం అంతంత మాత్రమే. ఇంటర్నెట్ యుగంలో ఆడియో క్యాసెట్లు ఎవరు కొంటారు, సెల్ ఫోన్ షాప్ పెట్టుకోండి అని భార్య పోరు పెడుతుంటుంది. అయితే మూర్తికి సంగీతం తప్ప మరేం తెలీదు. ఏం చేసినా ఈ సంగీతంతోనే. డీజేగా మారితే డబ్బులు ఎక్కువ సంపాదించొచ్చని ఎవరో సలహా ఇస్తారు. అప్పటి నుంచీ డీజే అవ్వాలన్న ప్రయత్నాలు మొదలెడతాడు. ఈ ప్రయాణంలో అంజన (చాందినీ చౌదరి) పరిచయం అవుతుంది. అంజన స్వతంత్ర్యభావాలు కల అమ్మాయి. డీజేగా స్థిరపడాలనుకొంటుంది. అయితే ఇంట్లోవాళ్లు ఒప్పుకోరు. అయినా వాళ్లని ఎదిరించి, తన కాళ్లపై తాను నిలబడాలనుకొంటుంది. మూర్తి పట్టుదల చూసిన అంజన, డీజేగా కొన్ని కిటుకులు నేర్పుతుంది. ఓ గురువుగా మారుతుంది. ఆ తరవాత మూర్తి ప్రయాణం ఏ రీతిన సాగింది? అంజన తన లక్ష్యాన్ని చేరుకొందా, లేదా? అనేది మిగిలిన కథ.
జీరో నుంచి హీరో అయ్యే ప్రయత్నాలు, ఆ గాథలు ఎప్పుడూ బాగుంటాయి. మూర్తి కథ కూడా అలాంటిదే. ఈ కథలో ప్రేరణ ఉంది. స్ఫూర్తి ఉంది. ముందే చెప్పుకొన్నట్టు ఓ కథగా చదివినప్పుడు బాగుంటుంది. అది సినిమాగా మారే క్రమంలో ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని అందించిందా అనేదే అసలు ప్రశ్న. ఊర్లో సాధారణమైన జీవితాన్ని అనుభవిస్తున్న మూర్తి, తన ఇష్టాలు, ఇంట్లో కష్టాలూ.. ఈ నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఆ తరవాత డీజేగా మారాలన్న ఆలోచన రావడం, ఆ ప్రయాణంలో సంజన పరిచయం అవ్వడం ఈ కథలోని మలుపులు. ఇలాంటి కథలకు ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా యాభై ఏళ్ల వయసులో డీజే అవ్వాలని చేసే ప్రయత్నంలో ఎన్ని ఆటుపోట్లు ఉంటాయో అర్థమవుతూనే ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చిపడిపోయే సన్నివేశాలేం ఉండవు. ప్రతీ సన్నివేశం, సంఘర్షణ ప్రేక్షకుల ఊహకు అందుతూనే ఉంటుంది. ఎలాగైనా సరే, డీజే అవుతానని శపథం పూనిన మూర్తి ఇంట్లోంచి బయటకు రావడంతో ఇంట్రవెల్ పడుతుంది. హైదరాబాద్‌లో మూర్తి పడే కష్టాలు, తనని ఆదుకొన్న మనుషులు, ఎదురైన సవాళ్లు.. వీటితో ద్వితీయార్థం సాగింది.
సాధారణంగా ఇలాంటి కథల్లో స్పోర్ట్స్ డ్రామాలెక్కువ. ఈ నేపథ్యానికి డీజేని జోడించడం వల్ల కాస్త ఫ్రెష్ నెస్ వచ్చింది. తాతయ్య కావల్సిన వయసులో డీజేగా అవ్వాలని మూర్తి చేసిన ప్రయత్నాలు కొన్ని కదిలిస్తాయి. కాకపోతే చాలాచోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకొన్నాడు దర్శకుడు. రోడ్ల మీద పడుకోవడం, ఆకలికి అలమటించిపోవడం.. ఇలాంటి సన్నివేశాలు చూసీ చూసీ అలసిపోయిన ప్రేక్షకుల గుండె కొత్తగా కరగడానికి ఏం లేదన్నట్టు తయారైంది. ఓరకంగా మొద్దుబారిపోయింది. ఇలాంటి సన్నివేశాలతో ప్రేక్షకుల్ని కదిలించాలనుకోవడం ఓరకంగా సాహసమే. తొలి సగంలో యాక్టీవ్ పాత్ర పోషించిన అంజన రెండో సగానికి వచ్చేసరికి హఠాత్తుగా మాయమైపోతుంది. మళ్లీ క్లైమాక్స్‌లో గానీ తేలదు.
డీజే టిల్లు లాంటి వినోదాత్మక సినిమాకు సెంటిమెంట్ వెర్షన్‌గా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ తయారైంది. సెంటిమెంట్ ని నమ్ముకోవడం తప్పు కాదు. కానీ అది మరీ ఓవర్ డోస్ అవ్వకూడదు. డీజేగా మూర్తి అనుకొన్నది సాధించడంతో కథ ముగిసిపోవాలి. ఆ తరవాత ఏం జరిగిందన్నది పాయింట్ కాదు. కానీ.. అక్కడ్నుంచి సినిమా మరో పది నిమిషాలు నడుస్తుంది. అప్పటికే సెంటిమెంట్ డోస్ ఎక్కువైంది అనుకొంటే, అందులో ఇంకాస్త మెలోడ్రామా జోడించాడు దర్శకుడు. నిజానికి అజయ్ ఘోష్‌లో మంచి కామెడీ టైమింగ్ ఉంది. దాన్ని వాడుకోవొచ్చు కూడా. కానీ ఆ పాత్రని మరింత భారంగా మార్చుకొంటూ వెళ్లాడు దర్శకుడు. సరదా సరదాగా కథ చెబుతూ, చివర్లో ఎమోషన్ డోస్ పెంచితే… అలాంటి సినిమాలు ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి. కానీ దర్శకుడు మెలోడ్రామకే పెద్ద పీట వేశాడు.
అజయ్ ఘోష్ ఈ కథ మొత్తాన్ని నడిపించాడు. తన వయసుకి తగిన పాత్ర. హుందాగా, బాధ్యతతో చేశాడు. తన నుంచి కామెడీ యాంగిల్ పిండుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడంతే. ఈ విషయంలో అజయ్ తప్పేం లేదు. ఆమని ఇల్లాలి పాత్రలో అల్లుకుపోయింది. తన అనుభవం చూపించింది. చాందిని చౌదరి పాత్రని బాగా మొదలెట్టి, మధ్యలో వదిలేసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ చివర్లో ఆ పాత్రని సరైన సమయంలోనే మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. చాలాకాలం తరవాత భానుచందర్ ఓ పాత్రలో మెరిశారు.
టైటిల్‌ని బట్టి చూస్తే సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన సినిమా ఇది. టైటిల్ ట్రాక్ బాగుంది. ఆ పాటలో అజయ్ ఘోష్‌తో సిగ్నేచర్ స్టెప్పులు కూడా వేయించారు. ఆ పాట మినహా మరేదీ గుర్తుండదు. డీజే ట్రాకులు కొన్ని మెప్పిస్తాయి. చిన్న సినిమా అయినా, సాంకేతికంగా క్వాలిటీ ఉంది. ఇలాంటి కథలు స్ఫూర్తి ఇస్తాయనడంలో సందేహం లేదు. కాకపోతే ఇలాంటి సీరియస్ కథల్నిచూడ్డానికి జనాలు థియేటర్ల వరకూ వెళ్తారా అనేది అనుమానం.
తెలుగు360 రేటింగ్: 2.5