వైసీపీ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ కు ఆలస్యంగా జ్ఞానోదయం అయినట్లు ఉంది. అసలు వాస్తవాన్ని ఆలస్యంగానైనా అంగీకరించారు. వైసీపీ నేతలందరిలా పార్టీ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ అని కాకుండా తమ అతి వలన, పొరపాట్ల వలన అధికారం కోల్పోయామంటూ అసలు నిజాలను కక్కేశారు. కొంతమంది మంత్రుల నోటి దురుసు వలన వైసీపీ ఓడిపోయినట్లు చెబుతున్నారని అదే నిజమైతే పొరపాట్లను సరిదిద్దుకుంటామన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సర్కార్ కు ఏకపక్ష విజయం దక్కడాన్ని జీర్ణించుకోలేక ఇటీవల వైసీపీ నేతలు అసహనంతో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు. మరోవైపు, ఐ ప్యాక్ , వాలంటీర్లే వైసీపీ దారుణ పరాభవానికి కారణమని అసలు వాస్తవాలను తొక్కిపెట్టె ప్రయత్నం చేశారు. వాస్తవాలను వెల్లడించేందుకు ఆ నేతలకు అహంకారం అడ్డొచ్చి ఉండొచ్చు. కానీ అనిల్ కుమార్ మాత్రం వాస్తవాలు జనం గమనించాక కూడా అవాస్తవాలను వల్లెవేస్తే మరింత విశ్వసనీయత కోల్పోతామని అనుకున్నారేమో, వైసీపీ ఓటమికి అహంకారం ఓ కారణమని చెప్పుకొచ్చారు.
వైసీపీ హాయాంలో మంత్రుల అతి ఎక్కువగా కనిపించేది. శాసన సభలో జగన్ భజన, ప్రత్యర్ధి నేతలను టార్గెట్ చేసుకొని దారుణంగా దుర్భాషలాడి చట్ట సభల ఔన్నత్యాన్ని దెబ్బతీశారనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. ఇది సాధరణ జనాలను సైతం ఆలోచింపజేసింది. సమస్యలను ప్రస్తావించి పరిష్కరించాల్సిన చోట వాటిని పక్కనపెట్టి ప్రత్యర్ధి నేతలపై వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యతనివ్వడంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.
వైసీపీ నేతల అరాచకాలను ప్రజలు చీదరించుకున్నారు. సరిగ్గా సమయం వచ్చినప్పుడు తమ వజ్రాయుధంతో కర్రుకాల్చి వాత పెట్టారు. అయినా కొంతమంది నేతలు వైసీపీ ఓటమికి అసలు కారణాలను చెప్పకుండా వ్యవస్థలపై నిందలు మోపే ప్రయత్నం చేయగా…అనిల్ కుమార్ మాత్రం ఓటమికి వైసీపీనే కారణమంటూ పరోక్షంగానైనా స్పష్టత ఇచ్చి వైసీపీ నేతల నోర్లకు తాళం వేశారు.