ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను నియమించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతోన్న అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో పల్లాకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది.
గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్ నాథ్ పై 95వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అధిష్టానానికి విధేయుడిగా పేరున్న పల్లాకు ఈసారి కేబినెట్ లో చోటు దక్కుతుందన్న ప్రచారం జరిగింది. చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా కీలకమైన పార్టీ పగ్గాలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పల్లా నియామకంతో మరోసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీసీ నేతకే చంద్రబాబు కట్టబెట్టారు.
ఈ కేబినెట్ లో చాలామంది సీనియర్లకు అవకాశం దక్కలేదు. దాంతో అచ్చెన్నా స్థానంలో పార్టీ పగ్గాలు మరో సీనియర్ నేతకే అప్పగిస్తారని టీడీపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, యువకుడు , పార్టీ పట్ల విధేయత కనబరిచే పల్లాకు అధ్యక్ష బాధ్యతలను కట్టబెడుతూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.