ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసుకున్న వైసీపీ… సోషల్ మీడియా పుణ్యమా అని తన గోతిని తనే తవ్వి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. కూటమి సర్కార్ ను టార్గెట్ చేయబోయి తన తప్పిదాలను తనే బయటపెట్టుకుంటూ తీవ్ర విమర్శల పాలౌతుంది.
చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఒక్కొక్కటిగా హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా డీఎస్సీపైనే చంద్రబాబు తొలి సంతకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16, 347 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు తేలడంతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే, ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీపై విమర్శలు చేసి నెటిజన్లతో వైసీపీ చీవాట్లు పెట్టించుకుంటుంది.
మెగా డీఎస్సీ పేరుతో టీడీపీ మెగా మోసానికి పాల్పడిందని ట్విట్టర్ వేదికగా వైసీపీ మండిపడింది. అధికారంలోకి వస్తే 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చాక 16,347పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది అని వైసీపీ చేసిన ట్వీట్ గురి తప్పి వైసీపీకే గుచ్చుకుంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఆరు వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వగా.. చంద్రబాబు సర్కార్ మరో పది వేల పోస్టులను గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా కూటమి సర్కార్ మెగా మోసానికి పాల్పడిందంటూ విమర్శలు ఎక్కుపెట్టడంతో మీ ప్రభుత్వంలో అది కూడా ఇవ్వలేదు కదా అంటూ వైసీపీని ఏకిపారేస్తున్నారు. ఇలా ఒక్క ట్వీట్ తో టీడీపీని ఇరకాటంలోకి నెట్టాలనుకున్న వైసీపీ వ్యూహాలు బూమరాంగ్ అయ్యాయి.
ఇప్పటికే వైసీపీ అధికారం కోల్పోవడానికి ఆ పార్టీ సోషల్ మీడియా కూడా ఓ కారణం అనే వాదనలు ఉన్నాయి. అధికారం కోల్పోయాక వైసీపీకి మద్దతు కోసం టీడీపీని కార్నర్ చేయాలనుకున్నా ఆ పార్టీ సోషల్ మీడియా వ్యూహం బెడిసికొట్టింది. దీంతో మెగా డీఎస్సీ విషయంలో ఆ పార్టీ సోషల్ మీడియా ప్లాన్ కాస్త వైసీపీనే దోషిగా నిలబెట్టింది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.