అబ్బా..అబ్బా.. ఏం మోటివేషన్ అండి. ఆయన గారు కార్పొరేట్ మోటివేషనల్ స్పీకర్ గా వెళ్తే ఆయన ఎక్కించే హైప్‌కి ఐటీ ఉద్యోగులు గాల్లో తేలిపోతారు. కానీ జగన్ రెడ్డికి ఎలా ఉందో ఆయన పక్కన ఉన్న వారికే తెలియాలి. ఇదంతా ఉండవల్లి అరుణ్ కుమార్ గురించే. ప్రతిపక్ష హోదా కూడా రాని జగన్ నిరాశపడిపోయాడని.. ఇంట్లో నుంచి బయటకు రావడం తెలిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తనదైన స్టైల్లో జగన్‌కు హైప్ ఎక్కించే ప్రయత్నం చేశారు. ఇందు కోసం తమిళనాడు కథలు చెప్పారు.
అప్పుడెప్పుడో జమానా కిందట డీఎంకే, అన్నాడీఎంకేలు ఒకరి తర్వాత ఒకరు.. భారీ విజయాలు.. అంతే ఘోర పరాజయాలు చూశారని..కానీ వారు ఇంట్లో పడుకోలేదని బయటకు వచ్చి పోరాటం చేశారని చెప్పుకొచ్చారు. అలా పోరాటం చేయకపోతే రాజకీయాల్లో ఉండే అర్హత లేదని చెప్పుకొచ్చారు. నిస్సత్తువ, నిస్సహాయత ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావడం అనవసరమని ఉండవల్లి తేల్చి చెప్పారు. అంతే కాదు జగన్ ఏం చేయాలో కూడా సలహాలు ఇచ్చారు. పార్టీలో పైన జగన్ వున్నారు, కింద ఓటర్లు వున్నారు, మధ్యలో వాలంటీర్లు ఉన్నారని ..కానీ వాలంటీర్లు హ్యాండిచ్చారన్నారు. అందుకే పార్టీ లేదని.. పునర్నిర్మాణం చేసుకోవాలని సలహా ఇచ్చారు.
ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి రాజకీయమంటే తెలియదని.. అసలు ఏ ఒక్కరికైనా సబ్జెక్ట్‌పై అవగాహన లేదని విమర్శలు గుప్పించారు. ఎంతసేపు బూతులు మాట్లడడమేనని ఫస్ట్ చేయాల్సింది వైసీపీ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వాలని హితవు పలికారు. చివరి నెల రోజుల్లోనే కూటమి పుంజుకుందని ఆ విషయం తాను జగన్ ను హెచ్చరించానని కూడా చెప్పుకొచ్చారు. జగన్ కోసం ఉండవల్లి తాపత్రయం చూసి వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సజ్జలను సాగనంపి ఉండవల్లిని పెట్టుకోవాలని సలహాలిస్తున్నారు. కానీ జగన్ కు ఉండవల్లి అంటే ఎందుకో అంత ఆసక్తి ఉండదు. కానీ జగన్ పై మాత్రం ఉండవల్లి ఎంతో ప్రేమ.