బీఆర్ఎస్ ను తీవ్ర అప్రతిష్టాలు చేసిన పేపర్ లీక్ అంశాన్నే రేవంత్ సర్కార్ పై ఎక్కుపెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసిందా..? కాంగ్రెస్ హయాంలోనూ పేపర్ లీకులకు తెరలేపెందుకు తెరవెనక కుట్రలు జరుగుతున్నాయా…? టీజీపీఎస్సీలో కొంతమంది అధికారులు బీఆర్ఎస్ కీలక నేతలతో నిమిషాలకొద్దీ మాట్లాడుతుండటంతో అందరి మదిలో ఈ ప్రశ్నలే మెదులుతున్నాయి.
రేవంత్ సర్కార్ కు కోవర్టుల బెడద వీడటం లేదు. ఇప్పటికే సచివాలయంలో కొంతమంది సీనియర్ అధికారులు బీఆర్ఎస్ నేతలకు టచ్ లో ఉన్నట్లు తేలగా…టీజీపీఎస్సీలో పని చేస్తోన్న కొంతమంది అధికారులు సైతం బీఆర్ఎస్ నేతలతో ఫోన్ లో నిమిషాల తరబడి మాట్లాడుతున్నట్లు జరుగుతోన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. అసలు కమిషన్ కు చెందిన అధికారులు బీఆర్ఎస్ నేతలతో ఫోన్ లో చాలాసేపు ఎందుకు మాట్లాడుతున్నారు..?వారు ఏయే అంశాలపై చర్చిస్తున్నారు..? వారితో టచ్ లో ఉండాల్సిన అవసరం టీజీపీఎస్సీ అధికారులకు ఎందుకు వచ్చింది..? అనేది చర్చనీయాంశం అవుతోంది.
బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ -1 తోపాటు పలు ప్రభుత్వ ఉద్యోగ అర్హత పరీక్షలు లీక్ అయ్యాయి. ఈ వ్యవహారం ఎన్నికల ముందు తీవ్ర ప్రభావం చూపింది. దాంతో నిరుద్యోగులు పెద్దఎత్తున కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ మధ్యే గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. త్వరలోనే మెయిన్స్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కమిషన్ లో పని చేస్తోన్న అధికారులు బీఆర్ఎస్ నేతలతో నిత్యం ఫోన్ లో టచ్ లో ఉండటం అనేక అనుమానాలకు తెరతీస్తోంది.
కాంగ్రెస్ సర్కార్ ను అప్రతిష్టపాలు చేసేందుకు బీఆర్ఎస్ తెరవెనక కుట్రలకు పాల్పడుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. తమను ఇరుకునపెట్టిన అంశంతోనే కాంగ్రెస్ ను బద్నాం చేయాలని బీఆర్ఎస్ స్కెచ్ వేసిందా..? అంటూ కాంగ్రెస్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. అయితే, ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి చేరడంతో బీఆర్ఎస్ నేతలతో టచ్ లోనున్న అధికారుల కదలికలపై నజర్ పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.