గత ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్కరుగా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. బీఆర్ఎస్ హాయంలో జరిగిన విద్యుత్ కొనుగోలు, ఒప్పందాలపై వివరణ కోరుతూ ఇప్పటికే కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు ఇవ్వగా…తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి పాలైన కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ దాఖలు చేసిన డాక్యుమెంట్లలో తప్పుడు సమాచారం పొందుపర్చారని పేర్కొన్నారు.
కేటీఆర్ కొడుకు హిమాన్షు పేరిట ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నికల అఫిడవిట్ లో డిపెండెంట్ లుగా భార్య, కూతురిని మాత్రమే పేర్కోన్నారని, అయితే, గత ఏడాది జులైలో మేజర్ అయిన హిమాన్షును డిపెండెంట్ గా చూపలేదని వివరించారు.
హిమాన్షు మర్కూక్ మండలం వెంకటాపూర్ లో 4 ఎకరాలు, ఎర్రవల్లిలో 32.15 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారని, మేజర్ గా మారిన కొన్ని నెలల వ్యవధిలోనే హిమాన్షు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను ఎలా సంపాదించారని , వీటిని కేటీఆర్ తన అఫిడవిట్ లో పొందుపరచలేదని పేర్కొన్నారు.
అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చిన కేటీఆర్ ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్. రాజేశ్వరరావు .. నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలన్నారు.