సినిమా రంగం సాధక బాధకాలు తెలుసున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో పరిశ్రమలో కొత్త ఆశలు చిరుగించాయి. ఇండస్ట్రీ ఎన్నో ఏళ్ళుగా ఎదురుకుంటున్న కొన్ని సమస్యల పరిష్కారానికి పవన్ తప్పకుండా చొరవ తీసుకుంటారని ఇండస్ట్రీ జనాలు నమ్మకంగా వున్నారు. ఈ క్రమంలో ఆయన నుంచి వచ్చిన ఓ ప్రకటనలో సినీ ఇండస్ట్రీ గురించి ప్రస్థావించారు పవన్.
సినీ రంగానికి రాష్ట్రంలో స్నేహపూరిత వాతావరణం నెలకొల్పుతామని చెప్పిన పవన్ కళ్యాణ్, సినీ పరిశ్రమకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడంతోపాటు ఆ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇక మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు గురించి స్పందిస్తూ.. జనసేన మూల సిద్ధాంతాలకు, తన మనసుకు దగ్గరగా తను నిర్వహించే శాఖలు వునాయని చెప్పారు. కీలక శాఖలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.