2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలో కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కుదేలయిన సంగతి తెలిసిందే. 2026 నియోజకవర్గాల పునర్విభజన లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజక వర్గం, ఎస్సీ రిజర్వు నియోజక వర్గంగా మారవచ్చని , అసలు ఈ పునర్విభజన ప్రక్రియ వైఎస్సార్సీపీ కి శరాఘాతం గా పరిణమించవచ్చని ,ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న తాజా రూమర్ వైఎస్సార్సీపీ నేతలకి ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే..
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంటే ఏమిటి?
భారత దేశం లో తాజా జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ మరియు లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజించేందుకు ఈ పునర్విభజన కమిషన్లు (Delimitation Commission) ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియలో భాగం గా ఎస్సీ మరియు ఎస్టీ నియోజకవర్గాలను గుర్తించడం మరియు రోటేట్ చేయడం కూడా ఉంటుంది. ఒకే నియోజకవర్గం శాశ్వతంగా ఎస్సీ లేక ఎస్టీ రిజర్వు అవ్వకుండా ఉండేందుకు రొటేషన్ పద్దతి లో రిజర్వ్డ్ నియోజక వర్గాలని మారుస్తూ ఉంటారు.
రాష్ట్రపతి తో ఏర్పాటు చేయబడ్డ పునర్విభజన కమిషన్ ఎన్నికల కమిషన్ తో కలిసి పనిచేస్తుంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీలు కూడా ఇందులో సభ్యులు గా ఉంటారు. కమిషన్ తీసుకునే నిర్ణయాలను సవాలు చేసే వీలు ఉండదు.
వివాదాలమయం అయిన 2006 పునర్విభజన
2006 లో జరిగిన పునర్విభజన ప్రక్రియ 2008 లో అమలు చేయబడింది. దీనికి అప్పట్లో వివిధ రాజకీయ పార్టీల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఉదాహరణకు:
ఆంధ్ర ప్రదేశ్: 2006 లో జరిగిన పునర్విభజన ప్రక్రియ పై అప్పట్లో తెలుగు దేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ కి పునర్విభజన ప్రక్రియ అనుకూలంగా ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ కు అనుకూలమైన ప్రాంతాలను ఒకే నియోజక వర్గం లో కలపడం, టిడీపి అనుకూల నియోజకవర్గాల లోని గ్రామాలని పక్క నియోజక వర్గాల్లో కలపడం వంటివి చేసి టిడిపి ని దెబ్బ తీసే విధంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగినట్టు అప్పట్లో టిడిపి నేతలు ఆరోపించారు.
మహారాష్ట్ర: శివసేన మరియు బిజెపి పార్టీలు 2006 పునర్విభజన ప్రక్రియ పై అసంతృప్తి వ్యక్తం చేశాయి. నియోజకవర్గాల ని కాంగ్రెస్-ఎన్సిపి సంకీర్ణానికి అనుకూలంగా పునర్విభజించినట్లు శివసేన- బిజెపి పార్టీ నేతలు ఆరోపించారు.
ఉత్తర్ ప్రదేశ్: సమాజ్వాదీ పార్టీ కూడా పునర్విభజన ప్రక్రియ పై విమర్శలు చేసింది. నియోజకవర్గాల మార్పులు తమ బలమైన ప్రాంతాలను బలహీనపరచి, ప్రత్యర్థులకు లాభం చేకూర్చినట్లు విమర్శించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ మరియు వైఎస్సార్ పై ఆరోపణలు:
2006 పునర్విభజన ఆంధ్రప్రదేశ్ లో కూడా వివాదాస్పదం కాగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మరియు కాంగ్రెస్ పార్టీ పునర్విభజన ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నట్టు టిడిపి ఆరోపించింది. టిడిపి ప్రధానంగా చేసిన రెండు ఆరోపణలు:
1.సరిహద్దుల పునర్విభజన: వైఎస్సార్ మరియు కాంగ్రెస్ పార్టీ – డీలిమిటేషన్ కమిషన్ ని ప్రభావితం చేసి టిడిపి బలమైన గ్రామాలను రెండు నియోజకవర్గాల మధ్య విభజించి, వారి ఎన్నికల అవకాశాలను బలహీనపరిచిందనేది టిడిపి అప్పట్లో చేసిన ప్రధాన ఆరోపణ
2.ఎస్సీ నియోజకవర్గాల ఎంపిక: టిడిపి కి బలమైన జనరల్ నియోజకవర్గాలను ఎస్సీ నియోజకవర్గాలుగా మార్చడం ద్వారా టిడిపి కి వైఎస్సార్ దెబ్బకొట్టాడనేది మరొక ఆరోపణ
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాని కి ఈ పునర్విభజన కూడా ఒక కారణమని కొంతమంది టిడిపి నేతలు అప్పట్లో వాదించారు.
2026 నియోజకవర్గాల పునర్విభజన: వైఎస్ఆర్సీపీ కి శరాఘాతం ?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టిడిపి అధికారంలో ఉండగా కేంద్రంలో టిడిపి మద్దతు తో ఎన్డిఎ అధికారంలో ఉంది. దీంతో 2026 పునర్విభజన వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం చూపవచ్చని 2006 పరిణామాలని గమనించిన కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు- ఎన్డిఏ ని, పునర్విభజన కమిషన్ ని ప్రభావితం చేసి పులివెందులను ఎస్సీ నియోజకవర్గంగా మార్చవచ్చని కొందరు వైకాపా నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. 2026 పునర్విభజన ప్రక్రియ లో భాగంగా- వైఎస్ఆర్సీపీ ఎన్నికల అవకాశాలను దెబ్బతీసే విధంగా నియోజక వర్గాలని పునర్విభజించే అవకాశం ఉందని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ భయపడుతోంది.
2024 లో జగన్ అధికారం లోకి వచ్చి ఉంటే:
అయితే చంద్ర బాబు ఈ విధంగా పునర్విభజన ప్రక్రియ ని ప్రభావితం చేస్తాడో లేదో తెలియదు కానీ జగన్ అధికారం లోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా కుప్పం ని ఎస్సీ నియోజక వర్గం గా చేయడం, టిడిపి ని దెబ్బ తీసే విధంగా పునర్విభజన ప్రక్రియ ని ప్రభావితం చేయడం ఖచ్చితంగా చేసేవాడని టిడిపి సానుభూతిపరులు అభిప్రాయ పడుతున్నారు. అలా జరిగి ఉంటే, టిడిపి 2029 లో కూడా కోలుకోలేక పోయేదని వారు అభిప్రాయపడుతున్నారు.
2014 ఏపీ పునర్విభజన చట్టం మరియు నియోజకవర్గాల సంఖ్య పెంపు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014, సెక్షన్ 26 ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు 175 నుండి 225కి, తెలంగాణలో 119 నుండి 153కి పెరగనుండగా, ఈ ప్రక్రియ కూడా తమకి ప్రతికూలంగా ఉండొచ్చని వైఎస్సార్సీపీ భయపడుతోంది. ఈ నియోజకవర్గాల పెంపు, ప్రస్తుత నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజన మరియు ఎస్సీ నియోజకవర్గాల గుర్తింపు – ఇవన్నీ కలిసి, వైఎస్సార్సీపీ భవిష్యత్ ఎన్నికల అవకాశాలను దెబ్బతీసే విధంగా పరిణామాలు ఉంటాయా అనే ఆందోళన వైఎస్సార్సీపీ లో కనిపిస్తోంది.
ఏది ఏమైయినా 2026 నియోజక వర్గాల పునర్విభజన తీవ్రమైన చర్చకి దారి తీసే విధంగా కనిపిస్తోంది
-జురాన్ (@CriticZuran)