బీఆర్ఎస్ పార్టీ ఊపిరి పోకుండా ఉండేందుకు కేసీఆర్ అనేక రకాల సమీకరణాలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడంతో బీఆర్ఎస్కు ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. ఆ విషయంలో లోక్ సభ ఎన్నికల్లో తేలిపోయింది. మరోసారి బీఆర్ఎస్ నిలవాలంటే బలమైన వర్గం అండగా ఉండాలి. కేసీఆర్ సొంత సామాజికవర్గం ఓట్లు రెండు శాతం కూడా ఉండవు. బీసీలు అండగా లేరు. ఎస్సీ, ఎస్టీలు ఎప్పుడో దూరమయ్యారు. అందుకే కేసీఆర్ ఇప్పుడుకొత్త ఆలోచన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
బీఆర్ఎస్ భవిష్యత్ కోసం ఫామ్‌హౌస్‌లో జరుపుతున్న మేథోమథనంలో కేసీఆర్ దళితుల్ని ఓటు బ్యాంక్‌గా మార్చుకుంటే బీఆర్ఎస్ భవిష్యత్ బాగుంటుందని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. తాను దిగిపోయి గౌరవాధ్యక్షుడిగా ఉంటానని.. మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ చేతుల్లో పెడతారని అంటున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రవీణ్ బాగా పని చేశారని.. ఆయన బీఆర్ఎస్ ను దళిత వర్గాల్లో తీసుకెళ్తారని భావిస్తున్నారు.
దళితసీఎం నినాదంతో మొదట్లో… కేసీఆర్ దళిత ఓట్లను బాగానే ఒడిసిపట్టారు.తర్వాత మోసం చేయడంతో అందరూదూరమయ్యారు. దళిత బంధు పేరుతో ఇంటికి పది లక్షలు ఇస్తామని చెప్పినా ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ను ముందు పెట్టి మళ్లీ వారి మద్దతు పొందాలనుకుంటున్నారు. అయితే కేసీఆర్ దిగిపోవడం అనే లీకులు మైండ్ గేమ్ అని..గతంలో కూడా ఇలా చేశారన్న విమర్శలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి.