పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉండటంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ధీటుగా విజయం సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ అంటే అర్బన్ ప్రాంతాలకే పరిమితమైన పార్టీ అనే విమర్శలకు, లోకల్ బాడీ ఎలక్షన్ లో గణనీయమైన స్థానాలను దక్కించుకోవడం ద్వారా చెక్ పెట్టాలని ప్రత్యేక వ్యూహం అనుసరిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాలు ఎంత..? పార్టీ ఇంకా ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది..? ఇందుకోసం ఎలాంటి వ్యూహాలను అనురించాలి అనే అంశంపై ఫోకస్ పెట్టిన బీజేపీ…ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ధీటుగా 8ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ వైపు చాలామంది బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు. కాంగ్రెస్ లోకి వెళ్ళలేని నేతలను బీజేపీలో చేర్చుకోవాలని కమలనాథులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి చెక్ పెట్టాలంటే ఇది తప్పనిసరి అని భావిస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో చాలామంది నేతలు పక్కచూపులు చూస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన నేతలకు పూర్వాశ్రమంలోని చాలామంది నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారితో సంప్రదింపులు జరిపి పార్టీలో చేర్చుకోనేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయని త్వరలోనే బీఆర్ఎస్ లోని కీలక నేతలు బీజేపీ గూటికి చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం.ఇదే జరిగితే బీఆర్ఎస్ మరింత ప్రభావం కోల్పొయే సూచనలు కనిపిస్తున్నాయి.