నువ్ ఏది ఇస్తే నీకు అది తిరిగి వస్తుంది. ఇది గీతలో కృష్ణుడు చెప్పిన కర్మ సిద్ధాంతం. చాలా మంది మనుషులకు కూడా తీరిక ఉండదు కానీ.. కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే తమ జీవితంలో చేసిన కుట్రలు, కుతంత్రాల ఫలితాలను తాము రివర్స్‌లో అనుభవించి ఉంటారని తెలుసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే. ప్రజలకు మంచి చేస్తామని నమ్మబలికి అధికారం తీసుకుని ఐదేళ్ల పాటు ఆయన చేసిన కుట్రలు, కక్ష సాధింపులు అన్నీ రివర్స్ అవుతున్నాయి. ఆయన మీదకే వస్తున్నాయి.
అధికారం కోల్పోయి పది రోజులే అయింది. ఇప్పటికే ఫర్నీచర్ దొంగ ముద్ర పడింది. తమకు అధికారం వచ్చినప్పుడు కోడెల మీద ఈ ముద్ర వేశారు. ఆయన ఆత్మహత్యకు కారణం అయ్యారు. ఇప్పుడు జగన్ రెడ్డి తన ఇంటికి కోట్లతో చేయించుకున్న సోకుల వివరాలు బయటకు వచ్చాయి. కనీసం ఇప్పుడాయన ప్రతిపక్ష నేత కూడా కాదు. ఆయనపై ఫర్నీచర్ దొంగతనం కేసు పెట్టేలా పరిణామాలు మారుతున్నాయి. చంద్రబాబు ఇంటిని కూల్చాలని చూశారు. ప్రభుత్వానికి చెందిన ప్రజావేదిక కూల్చారు. ఇప్పుడు ప్రజధానంతో విశాఖ రుషికొండప్యాలెస్ పై కట్టుకున్న ఇళ్ల బాగోతం బయటకు వచ్చింది.
చంద్రబాబు ఇంటికి వెళ్లకుండా రోడ్లను బ్లాక్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జగన్ రెడ్డి తాను మాత్రమే ఉపయోగించుకునేలా రూపొందించిన రోడ్డును ప్రజలకు వదలాల్సి వచ్చింది. చేసిన ప్రతి తప్పుడు పనికి రివర్స్ లో కర్మ ఫలం అనుభవించాల్సిందే. ఐదేళ్లలో జగన్ రెడ్డిల చేసినవి చిన్న చిన్న తప్పులు కాదు. అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేసి ఆడిన ఓ ప్రమాదకరమైన ఆట. అధికారం ఉందని అన్ని వ్యవస్థలపైనా దాడి చేశారు. చివరికి న్యాయవ్యవస్థనూ వదల్లేదు. ఇప్పుడు ఆయనకు అన్నీ రివర్స్ లో తగలబోతున్నాయి. అదే కర్మఫలం.