డబ్బింగ్ సినిమా అంటే వెంట్రుక వేసి, కొండని లాగే ప్రయత్నమే. వస్తే.. కొండ, పోతే వెంట్రుక. కాకపోతే… డబ్బింగ్ సినిమాల్ని నమ్ముకొని ‘బోడిగుండు’తో మిగిలిన వాళ్లుఉన్నారు. కొన్నాళ్లుగా డబ్బింగ్ సినిమాలకు కాసులు రాలడం లేదు. అప్పుడప్పుడూ మలయాళం, కన్నడ సినిమాలు కాస్తో కూస్తో ప్రభావం చూపిస్తున్నాయి. తమిళ సినిమాలు మాత్రం పూర్తిగా తేలిపోతున్నాయి. తమిళ కథలపై ప్రేమ, నమ్మకాలు తగ్గుతున్న తరుణంలో వచ్చిన సినిమా ‘మహారాజ’.
విజయ్ సేతుపతి 50వ సినిమా ఇది. తమిళంలో పెద్ద హిట్. తెలుగులోనూ వసూళ్లు అదరగొడుతోంది. ఈవారం విడుదలైన సినిమాల్లో వసూళ్ల పరంగా నిలదొక్కకొన్నది ‘మహారాజ’ ఒక్కటే. తెలుగు హక్కుల్ని ఎన్.వి.ప్రసాద్ కేవలం రూ.2 కోట్లకు జేజిక్కించుకొన్నారు. శాటిలైట్ హక్కులతో సహా. ఇప్పుడు థియేట్రికల్ నుంచే రూ.5 కోట్ల వరకూ రావొచ్చని ఓ అంచనా. ఒక్క నైజాం నుంచే రూ.2 కోట్లు రావొచ్చని టాక్. శాటిలైట్ కనీసం రూ.3 కోట్లు వేసుకొన్నా రూ.8 కోట్ల లెక్క తేలుతోంది. అంటే.. రూ.6 కోట్ల లాభం. ఓ తమిళ డబ్బింగ్ సినిమా నుంచి ఈ స్థాయిలో లాభాలు రావడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. నిజానికి `మహారాజ`పై ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవు. ఈ సినిమా కొనడానికి తెలుగు నుంచి నిర్మాతలెవరూ ఆసక్తి చూపించలేదు. పార్టనర్ షిప్ పై విడుదల చేయాలని తమిళ నిర్మాతలు అనుకొన్నా, అందుకూ ఎవరి సపోర్ట్ దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్.వి. ప్రసాద్ రంగంలోకి దిగి చాలా చీప్‌గా ఈ సినిమా కొనేశారు. ఇప్పుడు లాభాలు చవి చూస్తున్నారు. ఈ విజయం.. తమిళ సినిమాలకే కాదు, డబ్బింగులకు కూడా బూస్టప్ గా పని చేస్తుందనడంలో సందేహం లేదు.