మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన 2014-19 వరకు ఐదేళ్ల పాటు టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్నారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత కొన్నాళ్లు పార్టీలోనే ఉన్నా ఆయన గ్రానైట్ వ్యాపారాలపై వందల కోట్ల ఫైన్లు వేసి వేధించడంతో వైసీపీలో చేరిపోయారు. వైసీపీలో చేరారనే కానీ ఆయనకు ఎలాంటి పదవీ బాధ్యతలు ఇవ్వలేదు. చివరికి టిక్కెట్ కూడా ఇవ్వలేదు.
ఆయన దర్శి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ సీటు కావాలని కోరారు. కానీ జగన్ శివప్రసాద్ రెడ్డికి ఆ సీటు ఇచ్చారు. వైసీపీ గెలిచిన పదకొండు సీట్లలో అదొక్కటి. ఆయనకు అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల్లో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చారని కానీ ఎక్కడా గెలిచే అవకాశాల్లేవన్న ఉద్దేశంతో వద్దనుకున్నారని అంటున్నారు. దర్శిలో టీడీపీ టిక్కెట్ చివరి వరకూ ఖరారు కాలేదు. ఆయనే పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ వైసీపీ నేతలు ఆయనను ఆపారు.
టీడీపీలోలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. వైశ్య వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే ప్రకాశం జిల్లాలో ఇతర గ్రానైట్ వ్యాపారం చేసే టీడీపీ నేతలు న్యాయపోరాటం చేసి పార్టీలోనే కొనసాగగా శిద్దా మాత్రం రాజీనామా చేశారు. ఇప్పుడు టీడీపీ నుంచి వేధింపులు ఉంటాయని రాజీనామా చేశారేమో కానీ.. టీడీపీలో చేర్చుకుంటారా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.