ఏపీలో టీడీపీ గెలుపొందటంతో తిరిగి తెలంగాణపై ఫోకస్ చేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆలోచనలో పడ్డారా..? టీడీపీ పునర్ వైభవం దిశగా సాగితే బీఆర్ఎస్ కు మరిన్ని ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తున్నారా..? టీడీపీకి ఛాన్స్ ఇవ్వకుండా బీఆర్ఎస్ ను బీసీలకు దగ్గర చేసేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకోబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
అసెంబ్లీ, పార్లమెంట్ వరుస ఎన్నికల్లో పరాజయంతో కేసీఆర్ సైతం సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీ గెలుపొందటం బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణలోనూ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తామనే చంద్రబాబు ప్రకటనతో కేసీఆర్ అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. టీడీపీ అంటేనే బడుగు, బలహీన వర్గాల పార్టీ అంటే ముద్ర ఉంది. బీఆర్ఎస్ భవిష్యత్ పై ఆందోళనగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ పెడితే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. దీంతో పార్టీలో బీసీల ప్రాధాన్యత పెంచేలా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
బీఆర్ఎస్ లో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. కుటుంబ పార్టీ అనే ట్యాగ్ ను తొలగించడమే కాకుండా దళిత, బహుజన వర్గాలకు పార్టీని దగ్గర చేసేలా మార్పులు చేపట్టనున్నట్లు చర్చ జరుగుతోంది. ఈమేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను తప్పించి ఆ స్థానంలో ఇద్దరిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్సీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను కట్టబెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆర్ఎస్పీకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఖాయం కాగా, బీసీ నేతల్లో ఎవరికీ ఛాన్స్ ఇవ్వాలనే అంశంపై కేసీఆర్ చర్చిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.