అధికారం కోల్పోవడంతో నేతలు పార్టీని వీడుతారోననే భయమో, లేదంటే వైసీపీ యాక్టివ్ గానే ఉందన్న సంకేతాలు ఇవ్వాలన్న ఆలోచనో జగన్ రెడ్డి మాత్రం హడావిడి మొదలు పెట్టారు. ఈ నెల 22న క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో జగన్ సమావేశం అవుతున్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ నేతలు కాదు. ఎమ్మెల్యేలు సైతం జగన్ ను కలిసేందుకు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆయన అపాయింట్ మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన సిట్యుయేషన్ ఉండేది. నియోజకవర్గ అభివృద్ధి గురించి జగన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళాలని ఎంత ప్రయత్నించినా ఆయన అపాయింట్ మెంట్ దొరకని పరిస్థితి ఉండేది. క్షేత్రస్థాయిలో వైసీపీ సర్కార్ గురించి జనాల ఫీడ్ బ్యాక్ ను తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలతో , ఎంపీలతో జగన్ చర్చించింది లేదు. సర్వం ఐ ప్యాక్.. సర్వం సజ్జల అనే తరహాలో ఆయన విధానాలు ఉండేవి. ఇదే ఓ రకంగా జగన్ రెడ్డి ఓటమికి కారణమైంది.
అధికారం పోయేసరికి ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులను క్యాంప్ కార్యాలయంలో సమావేశానికి రావాలని స్వయంగా జగన్ రెడ్డి ఆహ్వానం పలుకుతున్నారు. ఇంతలోనే ఎంత మార్పు అని నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఇదే నిరాడంబరత అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉండి ఉంటె వైసీపీకి దారుణమైన ఫలితాలు వచ్చి ఉండేవి కావని సొంత పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. పవర్ పోయాక ఎమ్మెల్యేలు, నేతలను నెత్తిన మోసినా ప్రయోజనం ఏంటని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అయితే, పార్టీకి ఒక్కొక్కరుగా నేతలు గుడ్ బై చెప్తుండటంతో వలసలకు చెక్ పెట్టేందుకే జగన్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు అని వాదనలు వినిపిస్తున్నాయి.