ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఢిల్లీకి వెళ్లి మరోసారి సోనియా, రాహుల్, ప్రియాంకలను కలిశారు. ముగ్గుర్నీ ఒకేసారి కలిసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటో ద్వారా షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసిపోతుంది. ఈ సమావేశంలో భవిష్యత్ ప్రణాళికలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు చాలా కొద్ది రోజుల ముందటే బాధ్యత తీసుకున్నప్పటికీ ఓటు బ్యాంక్ పెంచుకోవడం శుభపరిణామమని కాంగ్రెస్ భావిస్తోంది.
కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను వెనక్కి తెచ్చుకునే ప్రయత్నంలో తొలి అడుగు సక్సెస్ ఫుల్‌గా పడిందని సోనియా, రాహుల్ భావిస్తున్నారు. రాయలసీమలో ముస్లిం ఓట్లు ఈసారి కాంగ్రెస్ కు ఎక్కువగా పడ్డాయి. కడప సిటీలో పాతిక వేలకుపైగా ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి. అలాగే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న చోట ఓట్లు కాంగ్రెస్ కు ఎక్కువగా పడ్డాయి. ఇది మార్పునకు సంకేతంగా భావిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల్ని చేర్చుకుని సీట్లు ఇచ్చారు. అలాంటి చోట్ల కూడా మంచి ఓట్లు వచ్చాయి.
జగన్ ఘోరంగా ఓడిపోయినందున ఆ పార్టీకి భవిష్యత్ లేదనన అభిప్రాయం పెరుగుతున్నందున.. అడ్వాంటేజ్ తీసుకోవాలని షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ సూచిస్తుననట్లుగా తెలుస్తోంది. వైసీపీలో అసంతృప్త నేతల్ని కాంగ్రెస్ లో చేర్చుకోవాలని ముఖ్యంగా ముస్లిం, దళిత నేతలపై దృష్టి పెట్టి పార్టీలో చేర్చుకోవాలని సలహాలిస్తున్నారు. హైకమాండ్ కూడా సహకరిస్తుందని భరోసా ఇచ్చి పంపినట్లుగా తెలుస్తోంది.