కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాపు – కమ్మల మధ్య దశాబ్దాల వైరాన్ని దూరం చేసి కూటమి విజయం కోసం ఆ రెండు సామాజిక వర్గాలు కలిసి పని చేసేలా వంగవీటి రాధా విశేషంగా కృషి చేశారు. ఇదే కోస్తా జిల్లాలో కూటమి ఘన విజయానికి ఓ కారణమని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.
వంగవీటి రాధా కృషిని గుర్తించి ప్రభుత్వంలో సముచిత స్థానం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు ఆయనను వైసీపీలో చేర్చుకోవాలని జగన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఆ ఒత్తిళ్లకు తలొగ్గకుండా టీడీపీలోనే కొనసాగుతూ కూటమి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కృషి చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వైసీపీకి వ్యతిరేకంగా పని చేశారు. వంగవీటి రాధా ప్రచారం కాపు ఓట్లను కూటమి వైపు టర్న్ అయ్యేలా చేశాయన్న వాదనలు ఉన్నాయి. దీంతో చంద్రబాబు కేబినెట్ లో రాధాకు త్వరలో బెర్త్ దక్కవచ్చుననే ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు మంత్రివర్గంలో ప్రస్తుతం 24మంది మంత్రులు ఉండగా ఓ మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన నలుగురికి మంత్రి పదవులు దక్కాయి. అయినప్పటికీ వంగవీటి రాధా కృషిని పరిగణనలోకి తీసుకొని వ్యూహం మేరకే ఓ మంత్రి పదవి ఖాళీగా ఉంచినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో మండలికి రాధాను ఎంపిక చేసి ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటారన్న టాక్ నడుస్తోంది.