ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతు పలికారని ఎమ్మెల్సీలపై వరుసగా అర్థరాత్రి పూట అనర్హతా వేటు వేస్తూ ఉత్తర్వులు ఇప్పించింది వైసీపీ అధినాయకత్వం. అయితే అది వారికే రివర్స్ అవుతోంది. ఎందుకంటే ఆ ఖాళీలన్నీ టీడీపీ ఖాతాలో చేరిపోతున్నాయి. మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు వేశారు. అందులో ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు ఉన్నారు. వారి ఎన్నికకు షెడ్యూల్ జారీ చేసింది ఎన్నికల సంఘం.
కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్య, అనంతపురం జిల్లాకు చెందిన ఇక్బాల్ ఎమ్మెల్యే కోటాలో వైసీపీ ఎమ్మెల్సీలుగా గెలిచారు. వీరు టీడీపీలో చేరడంతో అనర్హతా వేటు వేశారు. రాజీనామాలు ఇచ్చినా అనర్హతా వేటు వేశారు. ఇప్పుడు ఉపఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇప్పుడు ఉన్న బలాబలాలను చూస్తే వైసీపీకి ఎమ్మెల్సీకి పోటీ చేసే చాన్స్ కూడా లేదు. అంటే రెండు స్థానాలు ఏకగ్రీవం అవుతాయి.
ఆ రెండు స్థానాలకు పదవులు వదులుకుని టీడీపీలోకి వచ్చిన వారికి ఇస్తారా లేకపోతే ఇంకెవరికైనా ఇస్తారా అన్నది టీడీపీ అధినాయకత్వం చూసుకుంటుంది. కానీ అనర్హతా వేటు వేయకపోతే.. కనీసం సాంకేతికంగా అయినా వారు వైసీపీ సభ్యులుగా ఉండేవారు. వైసీపీ తొందరపడి ఆ అవకాశాన్ని కూడా కోల్పోయింది. త్వరలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు.. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు వైసీపీకే ఎక్కువ సభ్యులున్నా.. వారు గెలవడం అసాధ్యం. అవి కూడా కూటమి ఖాతాలోనే పడనున్నాయి.