తెదేపా ఎంపి గల్లా జయదేవ్ నిన్న లోక్ సభ సభలో మాట్లాడుతూ “ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలో నిరుపేదలకి, సామాన్యులకి ఎంతో తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. కానీ దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరుగలేదని మేము భావిస్తున్నాము. రాష్ట్ర విభజన చేయాలని ఇదే పార్లమెంటులో తీసుకొన్న నిర్ణయం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయింది కనుక దానిని ఆదుకొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అయితే రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు విషయంలో గత 22 నెలలో కేంద్రం చొరవ చూపకపోవడం చేత నేటికీ రాష్ట్రం తీవ్ర సమస్యల మద్య ఎదురీదవలసి వస్తోంది. కనుక రాష్ట్ర పరిస్థితి దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం తక్షణమే రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలుచేయాలి. తగినన్ని నిధులు విడుదల చేయాలి,” అని గల్లా జయదేవ్ మోడీ ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర బడ్జెట్ లో ఈసారి ఏ రాష్ట్రానికి నిర్దిష్టంగా నిధులు కేటాయించలేదు. కనుక అందులో ఆంధ్రప్రదేశ్ పేరు కూడా కనబడలేదని సర్ది చెప్పుకోక తప్పదు కానీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా హామీ ఇచ్చిన ఆర్ధిక ప్యాకేజి గురించి ఇన్ని నెలలు గడుస్తున్నా ఎందుకు మాట్లాడటం లేదు?బిహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోడి నేరుగా ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటించడానికి లేని అభ్యంతరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎందుకు? అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. రాష్ట్రంలో తెదేపాతో భాజపాకి ఎటువంటి సంబంధాలు, లెక్కలున్నాయో ప్రజలకి అనవసరం. విభజన సమయంలో, ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ పట్ల తెదేపా ప్రభుత్వం అసంతృప్తి ప్రకటిస్తే, తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి ప్రకటించారు. కేంద్రబడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జగన్ వాదనను ఇష్టపడటం లేదు. గతం పోలిస్తే ఈసారి బడ్జెట్ 20.3 శాతం పెంచమని, అన్ని రంగాలకు ఉన్నంతలో తగిన నిధులు కేటాయించామని, తమ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనుల వలన 10.97 శాతం అభివృద్ధి సాధించగలిగామని, అది జాతీయ స్థాయి కంటే సుమారు 5 శాతం ఎక్కువని తెదేపా ప్రభుత్వం చెప్పుకొంది. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు కూడా తమప్రభుత్వం తీసుకొంటున్న విప్లవాత్మక నిర్ణయాలు చేపడుతున్న అభివృద్ధి పనుల వలన దేశం శరవేగంగా అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని చెప్పుకొన్నారు.
కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లుగా ఎవరి బడ్జెట్ వారికి చాలా అద్భుతంగా కనిపించవచ్చును కానీ ప్రతిపక్షాలకి కాదు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఏటేటా ప్రవేశపెడుతున్న ఈ గొప్ప బడ్జెట్ ల వలన దేశంలో సామాన్య పౌరుల జీవన ప్రమాణాలు ఏమయినా పెరిగితే అదే ఉత్తమమయిన బడ్జెట్ అవుతుంది.